మే 3 వరకు లాక్‌డౌన్‌: మోదీ | Narendra Modi Extends Lockdown Till 3rd May | Sakshi
Sakshi News home page

మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ

Published Tue, Apr 14 2020 10:17 AM | Last Updated on Tue, Apr 14 2020 5:15 PM

Narendra Modi Extends Lockdown Till  3rd May - Sakshi

న్యూఢిల్లీ : మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 20వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్‌ రేపు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను బాధ్యతగా పాటించాలని కోరారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. 

మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేటితో తొలిదశ లాక్‌డౌన్‌ గడువు పూర్తయింది. ప్రజలు సైనికుల్లా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారు. మీకు దేశం వందనం చేస్తుంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.  కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. వాస్తవానికి దేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయి. అనేక రాష్ట్రాలల్లో పండగలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. పండగలు ఉన్నా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ తమను తాము నియంత్రించుకుంటున్నారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేడు దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఓ పోరాటం జరుగుతుంది. చాలా దేశాల కంటే ముందే భారత్‌లో ఏయిర్‌పోర్ట్‌లలో విదేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించాం.దేశంలో ఒక్క కేసు నమోదు కాక ముందే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం.

దేశంలో 500కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకంటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని ఈ మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఏదేశంతోనూ పోల్చడానికి వీలులేని విపరీతమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే... మన దేశ పరిస్థితి బాగుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి విషయంలో ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో... ఇప్పుడు కరోనా కేసులు మనకంటే 25రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. ఈరోజు భారత్‌ పరిస్థితి దారుణంగా ఉండేది. భౌతిక దూరం, లాక్‌డౌన్‌ మంచి ఫలితాలు ఇచ్చాయి. ప్రభుత్వాలనుంచి, ప్రజల నుంచి కూడా లాక్‌ డౌన్‌ పొడిగించాలనే సలహాలు వచ్చాయి. ఈ మేరకు లాక్‌డౌన్ మే 3వరకు పొడిగిస్తున్నాం. మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా... మీరందరూ దీనిని బాధ్యతగా పాటించాలి. కరోనాను కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క కొత్త కేసు వ్యాపించిన ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో ఒక్కరు చనిపోయినా అది ప్రమాదకరం. ప్రజలు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను పాటించాలి. అలా చేయకపోతే.. కరోనా మనకు మరింత నష్టం చేస్తుంది.

వచ్చే వారంలో కరోనాపై పోరాటం కోసం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఏప్రిల్ 20 వరకు దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఏప్రిల్ 20 తరువాత కొన్ని చోట్ల మినహాయింపు ఇస్తాం. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే అన్ని మినహాయింపులు తీసేస్తాం. కాబట్టి మనమందరం కరోనా కట్టడికి జాగ్రత్తతో ఉండాలి. పేద ప్రజల కోసమే ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని చోట్ల సడలింపులు చేస్తాం. లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో కరోనా కోసం ప్రత్యేకంగా లక్ష బెడ్‌లు ఏర్పాటు చేశాం. కరోనా కోసం 600 ప్రత్యేక హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశాం. మీ ఇళ్లలో ఉన్న వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడే వారుంటే ...వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోండి. మీ రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి... ఆయుష్‌ సంస్థ ఇచ్చే నిబంధనలు పాటించండి. ఆరోగ్య సేతు మోబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి... ఇతరులతో కూడా డౌన్‌లోడ్ చేయించండి. పేద ప్రజలకు ఆహారం అందేలా చూడండి. మీ దగ్గర పనిచేసే వారిపై ప్రేమ చూపండి... ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించకండి. పోలీసులు, నర్సులు, పారిశుద్య కార్మికులను గౌరవించండి. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు. 

చదవండి : ‘అంతకు మించిన దేశభక్తి మరోకటి లేదు’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement