
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు తగు సూచనలిస్తున్నారని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ కార్యదర్శులు చర్చలు జరుపుతున్నారని, దీనికి అనుగుణంగా ప్రధాని నరేంద్రమోదీ సైతం ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు అనుసరించిన వ్యూహాలపై సలహాలు, సూచనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రక్షణ మంత్రి త్రివిధ దళాల చీఫ్ కమాండర్‌తో సమీక్ష నిర్వహిస్తూ సైన్యం సంసిద్ధత గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు. మరోవైపు సరిహద్దులో ఉన్న ఆర్మీ, నేవీ, వైమానిక అధికారులకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ త్రివిధ దళాల సర్వీసుల శిక్షణ బాగానే జరుగుతోందన్నారు. అయితే వీటికి అవసరమయ్యే ఆయుధాలు, సామాగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని రావత్ వెలిబుచ్చారు. దీనికోసం రానున్న కాలంలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో, ఐఐటీలు, ప్రైవేటు పరిశ్రమలు, త్రివిధ దళాలతో కలిసి పని చేయాలన్నారు. తద్వారా దిగుమతులు తగ్గుముఖం పట్టి, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కరోనా పోరాటంలో తమ కంపెనీలు ముందుకొచ్చి సాయం చేస్తున్నాయని, అందులో భాగంగా కొన్ని కంపెనీలు వెంటిలేటర్లను అందించగా డీఆర్‌డీఓ ఎన్99 మాస్కులను రూపొందించిందని తెలిపారు. (అమెరికా తరహా వ్యూహాలను అమలుపరచాలి: రావత్)