‘గణతంత్ర అతిథి’కి ఘన స్వాగతం
► నేడు అబుదాబి ప్రిన్స్‌తో భేటీ
► డజను ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్– నహ్యన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి నహ్యన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు నహ్యన్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ గురువారం జరగనున్న 68వ గణతంత్ర వేడుకల్లో అబుదాబి యువరాజు నహ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆయనకు భారత్ ఆహ్వానం పంపింది. 2006లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. 2016 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు.
నేడు మోదీ, అబుదాబి ప్రిన్స్ నహ్యన్ భేటీ
భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదరనుంది. ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు నహ్యన్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. యూఏఈ భారత్‌లో 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టే అంశంతోపాటు డజనుకు పైగా ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.