
న్యూఢిల్లీ : దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన సూర్యగ్రహణం కొద్ది సేపటి క్రితం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సూర్యుడు సప్తవర్ణాలతో కనువిందు చేశాడు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, చిన్నారులు, ప్రముఖులు ఆసక్తి కనబరిచారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సూర్య గ్రహణాన్ని చూడలేకపోయానని తెలిపారు. ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల గ్రహణాన్ని వీక్షించే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు.
‘చాలా మంది భారతీయుల మాదిరిగానే.. నేను కూడా ఈ అద్భుత సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు చాలా ఉత్సాహం కనబరిచాను. దురదృష్టవశాత్తు గ్రహణం ఏర్పడిన సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం వల్ల నేను సూర్యున్ని చూడలేకపోయాను. అయితే కోజికోడ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాను. అలాగే నిపుణలతో మాట్లాడుతూ ద్వారా ఈ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందిచుకున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.