సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలను యావత్ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరలని దేశ వ్యాప్తంగా ప్రార్థించారు. ‘జై జవాన్.. అమర జవాన్’ నినాదాలతో భారతదేశం హోరెత్తింది. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధంచేసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరులకు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
జవాన్లపై దాడికి పాల్పడిన వారికి ఖచ్చితంగా బదులిచ్చి తీరాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పాఠశాల చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా అమరులకు ఘన నివాళి అందించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా హైదరాబాద్‌లో క్రైమ్ జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా వర్ణించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని పలువురు జర్నలిస్టులు తెలిపారు. ఏపీలో పట్టణాల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదులు దాడికి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment