సోషల్ మీడియా అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేవి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామే.భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నెటిజన్లు ఫాలో అయ్యేవి ఈ యాప్‌లే. అయితే వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో అటువంటి మరో యాప్ దేశంలో ప్రస్తుతం వేగంగా యువతను ఆకట్టుకుంటోంది. భారతీయ భాషల్లో అందుబాటులోకి రావడం ద్వారా స్వదేశీ ముద్ర వేసుకొని దూసుకుపోతున్న ఆ యాపే ‘షేర్‌చాట్’. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులైన ఫరీద్ అహ్‌సాన్, భానుసింగ్, అంకుష్ సచ్‌దేవ్ బెంగళూరు కేంద్రంగా 2015 అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించారు. షేర్‌చాట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా
14 భారతీయ భాషల్లో మొత్తం 3 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది.
అసలేంటీ యాప్?
ప్రతి ఒక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. కానీ వారికి వాళ్ల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సరైన వేదికలు దొరకవు. అలాంటి వారి ప్రతిభను, సృజనాత్మకతను తమ మాతృభాషలోనే ప్రదర్శించేందుకు, ఇతరులతో పంచుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతున్నదే షేర్‌చాట్. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లేదా షేర్‌చాట్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యాక యూజర్లు వీడియోలు, ఆడియోలు, జోకులు, జీఐఎఫ్‌లు, ఫొటోలను పంచుకోవచ్చు. వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోకి తిరిగి షేర్ చేసుకోవచ్చు. అలాగే షేర్‌చాట్‌లోని కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలపైనే దృష్టి...
దేశంలో ఇంగ్లిష్ మాట్లాడగలిగిన, అర్థం చేసుకోగల సుమారు 15 కోట్ల మంది నెటిజన్లు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఆంగ్ల ప్రధాన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ల యూజర్లుగా ఉన్నట్లు షేర్‌చాట్ నిర్వాహకులు గుర్తించారు. అప్పటికే దూసుకుపోయిన ఆయా యాప్‌ల తరహాలోనే మళ్లీ ఆంగ్ల మాధ్యమంలో కొత్త యూజర్లను ఆకట్టుకోవడం అంత సులభం కాదని గ్రహించారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాల్లోని యూజర్లను సంపాదించుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందుకోసం తొలుత ఇంగ్లిష్‌తోపాటు పలు భారతీయ భాషల్లో షేర్‌చాట్‌ను తీసుకొచ్చారు. వారి ఆలోచన సత్ఫలితాలిచ్చింది. 2015 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య లక్ష షేర్‌చాట్ యాప్ ఇన్‌స్టాల్స్ నమోదయ్యాయి. అప్పటికి షేర్‌చాట్‌లో ఉన్న సుమారు 70 వేల వాట్సాప్ గ్రూపుల ద్వారా నిత్యం 50 వేల భాగాల కంటెంట్ షేర్ అయ్యేది. యూజర్ల వాడకం ఆధారంగా ఇంగ్లిష్ ఆప్షన్‌ను షేర్‌చాట్ నుంచి ఆ తర్వాత తొలగించారు. ప్రస్తుతం షేర్‌చాట్‌కు 3.5 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు (నెలకు) ఉన్నారు. సగటున రోజుకు 20 నిమిషాలపాటు యూజర్లు షేర్‌చాట్ వాడుతున్నారు.
మాతృభాషలో అందుబాటులో...
షేర్‌చాట్ ప్రస్తుతం 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, భోజ్‌పురి, హర్యాన్వీ, రాజస్తానీ భాషల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని యూజర్లకు షేర్‌చాట్ ఇస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి ఆగ్నేయాసియా లేదా ఆఫ్రికాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం షేర్‌చాట్ మార్కెట్ విలువ రూ. 3 వేల కోట్లకుపైగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో షేర్‌చాట్ పెద్దగా ప్రజాదరణ పొందనప్పటికీ గుజరాత్, పశ్చిమ మహారాష్ట్ర, తూర్పు యూపీతోపాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న మలయాళీలు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఈ యాప్ ద్వారా కూడా తమ ప్రచారం చేసుకుంటున్నారు.
పోటీగా మరిన్ని యాప్‌లు
దేశీ సోషల్ మీడియాగా షేర్‌చాట్ ప్రఖ్యాతిగాంచడంతో దానికి పోటీగా మరికొన్ని దేశీ యాప్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిలో డైలీహంట్ (వార్తలు, వీడియోలు), న్యూస్‌డాగ్ (వార్తలు, వైరల్ కంటెంట్), టిక్ టాక్ (వీడియోల ప్రధాన యాప్), క్లిప్ ఇండియా (వీడియో, చాట్ యాప్) ప్రాచుర్యం పొందాయి. అలాగే మాతృభారతి (రచయితలకు స్వీయ ముద్రణ వేదిక కల్పించ డంతోపాటు భారతీయ భాషల్లో ఈ–బుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించే యాప్), ప్రతిలిపి (భారతీయ భాషల్లో సాహిత్యం, ఈ–బుక్స్ అందుబాటులో ఉంచే యాప్), శబ్దనగరి (హిందీ భాషలో మొట్టమొదటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్), ప్లానెట్ గోగో (స్థానిక భాషల్లో కంటెంట్ కోసం వెతికే అవకాశం కల్పించే లాక్–స్క్రీన్ యాప్).
- సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment