న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో భారీ భవంతులపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి గాను నగరంలో ఇప్పటికే 40 భవంతులను గుర్తించింది. వీటిపై సౌరవిద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన సామగ్రిని ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా ఎన్‌డీఎంసీ చైర్‌పర్సన్ జలజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌరవిద్యుత్ ఉత్పత్తి ద్వారా ఢిల్లీని ‘సోలార్ సిటీ’గా మార్చాలని నిర్ణయించామన్నారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఎండీఎంసీకి చెందిన పలు స్కూళ్లు, సబ్‌స్టేషన్లు, ఎంక్వైరీ కార్యాలయాలు, ఆస్పత్రులను గుర్తించామన్నారు. ఇవే కాక సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఇతర ప్రైవేట్,
ప్రభుత్వ భవనాలపై కూడా వీటిని అమర్చనున్నట్లు ఆయన వివరించారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఉండేవిధంగా సోలార్ యూనిట్ల గుర్తింపు, డిజైనింగ్, టెస్టింగ్, ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించేందుకు ఒక ఆపరేటర్‌ను ఎన్‌డీఎంసీ నియమించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్లను సైతం ఆహ్వానించింది. గత ఫిబ్రవరిలో అధికారులు ఎన్‌డీఎంసీ పరిపాలనా విభాగపు పరిధిని ‘సోలార్ సిటీ’గా ఎంపిక చేసి ప్రతిపాదనలను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపారు. దానికి ఆ శాఖ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇదిలా ఉండగా, భవంతులపై సోలార్ యూనిట్లను బిగించడం పూర్తయితే దేశంలోనే న్యూఢిల్లీ రెండో ‘సోలార్ సిటీ’గా గుర్తింపు పొందనుంది.
దేశంలో మొదటిగా చండీగఢ్‌లో ‘సోలార్‌సిటీ’ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎన్‌డీఎంసీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ తన మొత్తం విద్యుత్ వాడకంలో కనీసం 5 శాతాన్ని సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుకోనుంది. ఇదిలా ఉండగా, సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్‌డీఎంసీ గ్రిడ్‌కు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌సీ) నిర్ణయించిన రేట్ల మేరకు అనుసంధానించాలనేది సంస్థ ప్రణాళిక అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఏడాదిలోగా సోలార్ ప్లాంట్ల ద్వారా 8 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది ఎన్‌డీఎంసీ లక్ష్యమని శ్రీవాస్తవ తెలిపారు.
పస్తుతం నగరంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సౌరవిద్యుత్‌తో కొంతవరకైనా ఉపశమనం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నగర అవసరాలకు వేసవిలో రోజూ 350 ఎంవీఏ, శీతాకాలంలో 150 ఎంవీఏ విద్యుత్ అవసరమవుతోంది. ఇదిలా ఉండగా, ఓఖ్లాలో ఎండీఎంసీ ఏర్పాటుచేసిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ద్వారా సుమారు 16 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 8 వేల గృహాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ.. ఇక సోలార్ సిటీ!
Published Sun, Jul 6 2014 10:12 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
Advertisement