నీట్ వాయిదా కోసం ఆర్డినెన్సు?
కేంద్రం యోచన
న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వచ్చేఏడాది నుంచి నిర్వహించేందుకు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్డినెన్సు తీసుకు వచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో కేంద్రం ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ఆర్డినెన్సుపై అంతిమ నిర్ణయం తీసుకోనప్పటికీ దీన్ని కూడా ఓ ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తోందని సమాచారం.
బుధవారం ఉదయం జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ నోట్‌లోనూ ఈ అంశం లేదని స్పష్టమైంది. కాగా, ఈ ఏడాదినుంచే నీట్ అమలవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలు రాష్ట్రాలు.. ఈ తీర్పును ఏడాదిపాటు వాయిదా వేయాలని కోరాయి. వివిధ రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు నిర్ణయంతో విభేదించాయి. దీనిపై రంగంలోకి దిగిన కేంద్రం.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశమైంది. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు ఎట్టిపరిస్థితుల్లోనూ నీట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.