మెడిసిన్ ప్రవేశాలు ’నీట్’తోనే.. | NEET: Supreme Court confirms states can’t hold separate medical entrance exam | Sakshi
Sakshi News home page

మెడిసిన్ ప్రవేశాలు ’నీట్’తోనే..

Published Tue, May 10 2016 3:10 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

మెడిసిన్ ప్రవేశాలు ’నీట్’తోనే.. - Sakshi

మెడిసిన్ ప్రవేశాలు ’నీట్’తోనే..

- రాష్ట్రాల సొంత ప్రవేశ పరీక్షలకు సుప్రీంకోర్టు నో

- వైద్య విద్య ప్రవేశ పరీక్షలపై గందరగోళానికి తెర

- దేశమంతటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ‘నీట్’ ద్వారానే ప్రవేశం

- ‘నీట్’తో రాష్ట్రాలు, మైనారిటీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు

- నీట్-1కి దరఖాస్తు చేయని వారు, గైర్హాజరైన వారు నీట్-2 రాయాలి

- నీట్-1కి హాజరైనా బాగా రాయని వారు కూడా నీట్-2 రాసుకోవచ్చు

- వారు నీట్-1 మార్కులను వదిలేసుకోవాలి

- అవసరమైతే నీట్-2 షెడ్యూలులో మార్పు చేసుకునేందుకు అవకాశం

- సుప్రీంకోర్టు తాజా ఆదేశం.. పూర్వ ఉత్తర్వులను మార్చటానికి నిరాకరణ

 

సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో గందరగోళానికి సుప్రీంకోర్టు తెరవేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) రాయటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. తాము ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాలు, మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తులను తిరస్కరించింది. 2016-17 విద్యా సంవత్సరానికి కేవలం ‘నీట్’ మాత్రమే వైద్య విద్యా కోర్సులకు ప్రవేశ పరీక్షగా ఉంటుందని స్పష్టంచేసింది.

 

అదే సమయంలో.. తొలి విడతగా మే 1వ తేదీన నిర్వహించిన నీట్-1 పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులతో పాటు.. ఆ పరీక్ష సరిగా రాయలేదని భావించిన విద్యార్థులకూ మలి విడత నిర్వహించనున్న నీట్-2 పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని నిర్దేశించింది. అలాగే.. జూలై 24న నిర్వహించాలని నిర్ణయించిన నీట్-2 షెడ్యూలులో అవసరమైతే మార్పులు చేయవచ్చుననీ అనుమతిచ్చింది.

 

దేశవ్యాప్తంగా ఏకైక ఉమ్మడి పరీక్షగా ‘నీట్’ తప్పనిసరి అంటూ గత నెల 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు కోరుతూ పలు రాష్ట్రాలు, ప్రైవేటు కళాశాలల సంఘాలు, మైనారిటీ విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం మధ్యాహ్నం తుది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాత్రి 8 గంటల సమయంలో ఉత్తర్వులను సుప్రీం కోర్టు వెబ్‌సైట్ ద్వారావెలువరించింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

 

ఉత్తర్వుల్లోని ప్రధానాంశాలివీ...

‘ఏప్రిల్ 28 నాటి ఉత్తర్వుల్లో సవరణలు కోరుతూ వివిధ రాష్ట్రాలు, ప్రయివేటు మెడికల్ కళాశాలలు ఈ దరఖాస్తులన్నీ దాఖలు చేశాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2010 డిసెంబర్ 21న నీట్ నోటిఫికేషన్ జారీచేశాయి. సీఎంసీ వెల్లూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సంబంధిత నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ తీర్పును 2016 ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు రీకాల్ చేసింది. 2016 ఏప్రిల్ 28న ఈ దరఖాస్తులు వచ్చినప్పుడు ఎంసీఐ, సీబీఎస్‌ఈ, కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు 2016-17 సంవత్సరానికి నీట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే పిటిషనర్ల తరపు వాదనలు కూడా విన్నాం.

 

కేంద్ర జాబితా నిబంధనే చెల్లుతుంది...

ఇటీవల మే 2వ తేదీన మోడర్న్ డెంటల్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్ష నిర్వహించడం.. స్వయంప్రతిపత్తి ఉన్న తమ ప్రయివేటు కళాశాలల హక్కులను ఉల్లంఘించడమేనని చేసిన వాదనలను రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు రాష్ట్రానికి ఉన్న చట్టబద్ధమైన అర్హతను ఆ ధర్మాసనం ఆదరించింది. అదే సమయంలో అడ్మిషన్ల ప్రక్రియలో రెండు అంశాలు ఉన్నాయి. విద్యలో కనీస ప్రమాణాలను నెలకొల్పడం, ఆ ప్రమాణాలను సమన్వయం చేయటం అనే అంశం కేంద్ర జాబితాలో 66వ నిబంధనగా ఉంది.

 

ఇక రెండో అంశమైన ఆ ప్రమాణాల అమలు అనేది ఉమ్మడి జాబితాలో పొందుపరిచిన 25వ నిబంధన పరిధిలో ఉంది. ఈ అంశంలో రాష్ట్రం కూడా చట్టాలు చేయవచ్చు. ఈ రెండు నిబంధనలు కొంతమేర ఒకదాని పరిధిలోకి మరొకటి కలగలసి ఉన్నాయి. కొంతమేర.. ఉమ్మడి జాబితాలోని 25వ నిబంధన కన్నా కేంద్ర జాబితాలోని 66వ నిబంధన చెల్లుతుంది.

 

రాష్ట్రాలు, విద్యాసంస్థల హక్కులకు భంగం లేదు...

ప్రాథమికంగా.. రాష్ట్రాలు, ప్రయివేటు విద్యాసంస్థల హక్కులకు సంబంధించినంతవరకు నీట్ నిబంధనల్లో ఎలాంటి లోపం మాకు కనిపించలేదు. ఏ కేటగిరీకి సంబంధించినప్పటికీ రిజర్వేషన్ల కోసం ఉన్న ప్రత్యేక నిబంధనలపై ప్రభావం చూపే అంశం నీట్ నిర్వహణ  నిబంధనల్లో లేదు. అలాగే మైనారిటీల హక్కులపై కూడా నీట్ ప్రభావం చూపదు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే ప్రవేశ పరీక్షగా నీట్ ఉపయోగపడుతుంది. అందువల్ల 2016 ఏప్రిల్ 28 నాటి ఉత్తర్వుల మార్పు చేయాలన్న వాదనలో ఎలాంటి విలువ లేదు.

 

నీట్-1 విద్యార్థులు మళ్లీ రాసుకోవచ్చు...

నీట్-1కు దరఖాస్తు చేసినా గైర్హాజరైన విద్యార్థులకు లేదా హాజరైనప్పటికీ ఆ పరీక్ష కేవలం 15 శాతం జాతీయ కోటా సీట్లకేనని పూర్తిస్థాయిలో సిద్ధం కాకుండా రాసినవారికి తదుపరి పరీక్షలో హాజరయ్యే అవకాశం కల్పించడం.. తదితర విషయాల్లో విద్యార్థులకున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. ఇందుకు పరిష్కారంగా నీట్-1లో హాజరు కాలేకపోయిన విద్యార్థులు, హాజరైనప్పటికీ తాము బాగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. నీట్-2కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఆదేశిస్తున్నాం. అయితే నీట్-1లో హాజరై బాగా రాయడంలేదని నీట్-2లో రాయగోరు విద్యార్థులు తాము నీట్-1 నుంచి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ధ్రువీకరణ ఇవ్వాలి. అలాగే నీట్-2 షెడ్యూలులో అవసరమైతే మార్పులు చేసుకునేందుకు నిర్వాహకులకు అవకాశం ఇస్తున్నాం.

 

ఈమేరకు పూర్వ ఉత్తర్వుల్లో సవరణ చేసినట్టుగా భావించాలి. ఈ పరీక్ష నిర్వహణలో సీబీఎస్‌ఈ తమ విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి. సుప్రీంకోర్టు మే 2న వైద్య ప్రవేశపరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు నియమించిన కమిటీ నీట్-2ను పర్యవేక్షిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరోసారి స్పష్టత ఇస్తున్నాం.. నీట్ మాత్రమే విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్వ ఉత్తర్వుల మార్పు కోరుతూ దాఖలైన అన్ని దరఖాస్తులపై విచారణను ముగిస్తున్నాం’ అని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.

 

రాష్ట్రాలు, కేంద్రం వాదనలు ఇవీ...

అంతకుముందు మధ్యాహ్నం రెండు గంటలకు వివిధ రాష్ట్రాలు తుది వాదనలు వినిపిస్తూ తమ రాష్ట్ర చట్టాలను, రాజ్యాంగంలోని రక్షణలను అనుసరించి.. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వాదించాయి. అనంతరం కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ కేంద్ర అభిప్రాయాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ఈ ఏడాదికి రాష్ట్రాలు తమ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వొచ్చు. ప్రయివేటు కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు ప్రవేశపరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వరాదు. నీట్-1లో గైర్హాజరైన విద్యార్థులకు నీట్-2లో అవకాశం ఇవ్వాలి. అలాగే రాష్ట్రాలు తమ తమ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకున్నాయి. నిర్వహించుకోబోతున్నాయి. రాష్ట్రాల కోటా వరకు వాటికి అనుమతించాలి. రాష్ట్రాల కోటా కాకుండా ఇతరత్రా నిర్వహించే ఏ పరీక్షనైనా అనుమతించరాదు’ అని విన్నవించారు. ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించడం సబబు కాదని, బోధన మొత్తం ఆంగ్లంలో ఉంటుందని ఎంసీఐ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ ధర్మాసనానికి విన్నవించారు.

 

నీట్-1 రాసినప్పటికీ నీట్-2 రాయదలుచుకుంటే వారిని అనుమతించాలని, నీట్-2ను పరిగణనలోకి తీసుకోవాలని, అలా వీలవుతుందా? అని జస్టిస్ అనిల్ దవే ప్రశ్నించగా సీబీఎస్‌ఈ తరఫు సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ నిర్వహణ సాధ్యం కాదని బదులిచ్చారు. షెడ్యూలులో మార్పులు చోటుచేసుకుంటాయని, తద్వారా కౌన్సిలింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదిస్తూ రాష్ట్ర కోటాలోని అన్ని సీట్లకు ఎంసెట్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement