తావర్‌చంద్ గెహ్లట్
సాక్షి,న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018–19లో సమకూర్చనుంది. మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు.
ఆదాయ పరిమితి పెంపు:
ఓబీసీ ప్రీమెట్రిక్ సాల్కర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతమున్న వార్షికాదాయ పరిమితిని రూ. 44,500 నుంచి రూ. 2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచింది. డేస్కాలర్లకు స్టైఫండ్‌ను రూ. 225కు, హాస్టల్‌లో ఉండేవారికి రూ. 525కు పెంచింది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. స్టైపండ్‌ను స్థానిక విద్యార్థులకు రూ. 2,000కు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు రూ.5,000కు పెంచింది. డేస్కాలర్లకు ఒకటి నుంచి పది వరకు అన్ని తరగతులకు ఒకేలా రూ. 100 ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఇకపై మూడు నుంచి పది వరకు అన్ని తరగతులకు రూ. 500 ఇవ్వనున్నారు. షెడ్యూలు కులాల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ కింద సాయాన్ని రూ. 28 వేలకు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment