
వరకట్నం వేధింపులు ఈమె ఉసురుతీశాయి. మైసూరుకు చెందిన కార్పొరేటర్ కూతురు బెంగళూరులో అత్తింట ఉరితాడుకు వేలాడింది.
బొమ్మనహళ్లి : పెళ్లయి ఏడు నెలలు కూడా నిండకనే వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. అత్త పెట్టే వేధింపులు భరించలేక ఆ నవ వధువు నాలుగు పేజీల డెత్‌నోట్ రాసి ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో చోటు చేసుకుంది. వివరాలు... మైసూరు మహానగర పాలికె కార్పొరేటర్ నాగభూషణ్ కుమార్తె వనిత(26)ను తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వసంత్‌కు ఇచ్చి ఏడు నెలల క్రితం వివాహం జరిపించారు. అప్పటి నుంచి దంపతులు, వసంత్ తల్లిదండ్రులు ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి దంపతులు సంతోషంగానే ఉంటున్నారు.
అయితే అత్త గాయత్రి గత కొంతకాలంగా ప్రతి రోజు అదనంగా కట్నం తీసుకు రావాలని వేధింపులకు పాల్పడేది. అంతేకాకుండా తిండి కూడా సరిగా పెట్టేది కాదని, ఆమె పెట్టే వేధింపులకు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు వనిత తన డెత్‌నోట్‌లో రాసింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తన గదిలోకి వెళ్లిన వనిత మళ్లీ బయటకు రాలేదు. వసంత్ విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా వనిత ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే వసంత్ ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని డెత్‌నోట్ స్వాధీనం చేసుకుని వసంత్‌ను, అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.