మూడు రాష్ట్రాలకు తలంటేసిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యంపై పంజాబ్, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తలంటేసింది. కాలుష్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నాస్త్రాలు సంధించింది. కాలుష్యం నివారణకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించింది.
దీపావళి, పంటల దహనం కారణంగా కాలుష్యం పెరుగుతుందని తెలుసు కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ లో ఏమైనా సమావేశాలు నిర్వహించారా? పొగమంచు తగ్గినట్టు ఏమైనా గణంకాలు ఉన్నాయా? హెలికాప్టర్ల ద్వారా కాకుండా క్రేన్లతో ఎందుకు నీళ్లు చల్లుతున్నారు? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. కాలుష్యాన్ని నియంత్రించకపోతే మనం మాస్కులు ధరించినా ఫలితం ఉండబోదని హెచ్చరించింది. వాయు కాలుష్యం కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు, దీనిపై అధ్యయనం చేయమని శాస్త్రవేత్తలు ఎవరినైనా అడిగారా అని నిలదీసింది.
పంటలను దహనం చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని పంజాబ్ సర్కారును అడిగింది. వ్యవసాయ వ్యర్థాలు తొలగించడానికి రైతులకు ఎన్ని యంత్రాలు సమకూర్చారని సూటిగా ప్రశ్నించింది. అన్నదాతలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తే పంట వ్యర్థాలను వారు తగలబెట్టరని సూచించింది. పొగమంచు, కాలుష్యం నివారణకు హర్యానా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.