దేశంలో 10 అటల్ టింకరింగ్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: యువ ఆవిష్కర్తలను ప్రోత్సాహించేందుకు నీతి ఆయోగ్ దేశంలో 10 అటల్ టింకరింగ్ ప్రయోగశాల(ఏటీఎల్)లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. దీని కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇంటెల్‌తో రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎఐఎం)లో భాగంగానే వీటిని ఏర్పాటు చేయనుంది.
ముఖ్యంగా 12-18 ఏళ్ల వయస్సున్న విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలకు ఉపయోగపడే గణన ఆలోచన, సంయోజిత అభ్యాసం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే దీని(ల్యాబ్‌ల ఏర్పాటు) లక్ష్యం. అందుకోసం ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లను వెచ్చించి ఐదేళ్లలో దేశమంతటా 500 ఏటీఎల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది.
నూతన ఆవిష్కరణలకు కావాల్సిన వస్తువులు, పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థుల్లో ఒకరి నుంచి మరొకరికి జ్ఞానమార్పిడి జరగడానికి ఈ ఏటీఎల్ కేంద్రాలు ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ అభిప్రాయపడ్డారు.