సాక్షి, న్యూఢిల్లీ : తాను ప్రధానమంత్రి అభ్యర్ధి రేసులో లేనని కేంద్ర మంత్రి , బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తనకు ప్రధాని కావాలనే ఆకాంక్ష లేదని, ఆరెస్సెస్ సైతం ఈ దిశగా తనను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించే ఆలోచన చేయడం లేదని చెప్పారు. రాజకీయాల్లో తాను ఎప్పుడు పదవుల కోసం లెక్కలు వేసుకుని పనిచేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్ధాయి మెజారిటీ రాకుండా అస్పష్ట తీర్పు వెలువడితే ఆరెస్సెస్ ఆశీస్సులతో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నితిన్ గడ్కరీ ముందుకొస్తారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని గడ్కరీ తోసిపుచ్చుతూ ప్రధాని రేసులో తాను లేనని, అవిశ్రాంతంగా పనిచేయడమే తనకు తెలిసిన విషయమని స్పష్టం చేశారు. పనిచేసుకుంటూ ముందుకెళతానని, పదవుల గురించి ఆలోచించనని చెప్పారు.
దేశానికి ఏది మంచో అది చేయడమే తన కర్తవ్యమని తేల్చిచెప్పారు. ప్రధాని పదవి కోసం తాను ఎవరినీ కలిసింది లేదని, అసలు ఆ రేసులో తాను లేనని, ఇది తన హృదయంలో నుంచి చెబుతున్న మాటలని గడ్కరీ పేర్కొన్నారు. దేశం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మోదీజీ వెంట తాను, తన పార్టీ సమిష్టిగా పయనిస్తోందని తెలిపారు. తమ పార్టీకి 2014లో కన్నా ఈసారి అత్యధిక స్ధానాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విపక్షాల మహాకూటమిని మహాకల్తీ కూటమిగా గడ్కరీ అభివర్ణించారు. కాగా ఉపరితల రవాణా మంత్రిగా నితిన్ గడ్కరీ సేవలను యూపీఏ చైర్‌పర్సన్ సోనియా సహా విపక్షాలు ఇటీవల కొనియాడాయి. దేశ మౌలిక రంగ అభివృద్ధికి గడ్కరీ విశేషంగా కృషి చేశారని విపక్ష నేతలు ఆయనను ప్రశంసించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment