
‘పరివార్’ భేటీకి నితీశ్ డుమ్మా
న్యూఢిల్లీ: జనతా పరివార్‌లో పార్టీల విలీన ప్రక్రియ పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. విలీనంపై స్పష్టత ఇచ్చేందుకు ఉద్దేశించిన శుక్రవారం నాటి కీలక భేటీకి బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ డుమ్మా కొట్టారు. తన తరఫున జేడీ యూ చీఫ్ శరద్ యాదవ్‌ను పంపారు. నితీశ్ కంటికి చిన్న సర్జరీ జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో భేటీకి రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, శరద్ యాదవ్ మధ్య జరిగిన ఈ భేటీలో విలీన ప్రస్తావన రాలేదని తెలిసింది. బీజేపీపై పోరులో కలవాలని జేడీయూ బహిష్కరించిన మాజీ సీఎం జితన్‌రాం మాంఝీని లాలూ ఆహ్వానించడం నితీశ్‌కు మింగుడుపడ్డం లేదు.
శుక్రవారం నాటి భేటీలోనూ లాలూ ఆర్జేడీ, జేడీయూ విలీనం సంగతి పక్కనబెట్టి మాంఝీని ఆహ్వానించే ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలిసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏయేతర, లెప్ట్‌ను కలుపుకొని ‘మహా కూటమి’ ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆర్జేడీ, జేడీయూ విలీనంపై లాలూ ఆసక్తిగా లేరని, ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనకు ఎవరితో బేధాభిప్రాయా లు లేవని భేటీ అనంతరం లాలూ విలేకరులకు తెలిపారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలవాల్సిందిగా ఓవైపు లాలూ ఆహ్వానిస్తుండగా మాంఝీ ప్రధాని మోదీకి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈనెల 25, 28 మధ్య తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా మోదీని కోరారు. నితీశ్ ఉన్న ఏ కూటమి, పార్టీలో చేరబోనన్నారు.