ముఖ్యమంత్రిని కొట్టబోయిన నితీశ్‌కుమార్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. 'జనతా కా దర్బార్' కార్యక్రమం నిర్వహిస్తుండగా ఓ యువకుడు సీఎం నితీశ్‌ను చెప్పుతో కొట్టబోయాడు. దీంతో పోలీసులు అతన్ని అడ్డుకొని వెంటనే అరెస్టు చేశారు. యాదృచ్ఛికంగా ఆ యువకుడి పేరు కూడా నితీశ్‌కుమారే. ఆర్వాల్ జిల్లాకు చెందిన అతను సీఎంను కలిసి, తన వినతిపత్రం ఇచ్చేందుకు 'జనతా కా దర్బార్'కు వచ్చాడు. సీఎం దగ్గరికి వెళ్లగానే అతడు ముందుకువంగి తన చెప్పును తీయబోయాడు. అతన్ని భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్టు చేసి, ప్రశ్నించేందుకు సచివాలయ పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు సీనియర్ ఎస్పీ మను మహారాజ్ తెలిపారు.
ప్రజల ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తన అధికారిక నివాసంలో 'జనతా కా దర్బార్‌మే ముఖ్యమంత్రి' కార్యక్రమాన్ని నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్నారు. గతంలో అప్పటి డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ 'జనతా కా దర్బార్' కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనూ ఈ యువకుడు రచ్చ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు.