
మోదీ ప్యాకేజీ అంతా మాయ!
కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రధాని నరేంద్రమోదీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించారని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు.
♦ బిహార్ సీఎం నితీశ్ కుమార్ ధ్వజం
♦ పథకాలకు ఇచ్చిన నిధులను కొత్తగా ఇస్తున్నట్టు చూపారు
♦ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రకటించారు
♦ అంకెలతో ప్రజలను భ్రమింప చేయాలని చూశారు
♦ ప్యాకేజీ గుట్టును ప్రజాకోర్టులో బహిర్గతం చేస్తాం
పట్నా: కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రధాని నరేంద్రమోదీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించారని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు కేటాయించిన నిధులనే ప్యాకేజీలో చూపారని దుయ్యబట్టారు. రూ.1.25 లక్షల కోట్లలో వాస్తవంగా రాష్ట్రానికి దక్కే మొత్తం రూ.10,368 కోట్లు మాత్రమేనని చెప్పారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో, నిధులు విడుదలకు మార్గదర్శకాలేమిటో చెప్పలేదని ఎద్దేవా చేశారు. బుధవారమిక్కడ ఆర్థిక మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌తో కలిసి నితీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీలో 87%.. అంటే సుమారు రూ.1.08 లక్షల కోట్లు ప్రస్తుతం నడుస్తున్న, గతంలో ప్రకటించిన పథకాలకు కేటాయించిన నిధులే!
ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రణాళిక కూడా లేని ప్రతిపాదిత పనులకు ప్యాకేజీలో రూ.6 వేల కోట్లను చూపారు. ఒక్కమాటలో చెప్పాలంటే బిహార్‌ను, రాష్ట్ర గౌరవాన్ని వేలం వేసినట్టుగా.. ఎన్నికల్లో నెగ్గాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీ ప్రకటించారు. ఇది రాష్ట్రంపై వేసిన ఓ జోక్! కేవలం అంకెలతో భ్రమింప చేసే ప్రయత్నం చేసి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారు’ అని నితీశ్ మండిపడ్డారు. ప్యాకేజీ నిజ స్వరూపాన్ని ప్రజాకోర్టులో చూపుతామన్నారు.
ముందు గుజరాత్ సంగతి చూడండి
ప్యాకేజీతో బిహార్ దశనే మార్చేస్తానన్న మోదీ వ్యాఖ్యలపైనా నితీశ్ విమర్శలు సంధించారు. ‘మీ సొంత రాష్ట్రం(గుజరాత్) పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళనతో అట్టుడుకుతోంది. ముందుగా మీ రాష్ట్రం సంగతి చూసుకోండి’ అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీలో చేర్చిన వివిధ ప్రాజెక్టుల వివరాలను ఒక్కొక్కటిగా వివరించిన ఆయన.. వాటిని ఫేస్‌బుక్, ట్వీటర్‌లో కూడా పెట్టారు. ప్యాకేజీలో రూ.54 వేల కోట్ల విలువైన 41 జాతీయ రహదారుల ప్రాజెక్టులను చూపారని, ఇందులో రూ.47 వేల కోట్లు ఇంతకుముందే మంజూరయ్యాయని, ఇప్పుడు కేవలం రూ.7 వేల కోట్లు అదనంగా చేర్చారన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్యాకేజీలో రూ.13,820 కోట్లు చూపారని, ఆ నిధులు కూడా ఇప్పటికే మంజూరయ్యాయని చెప్పారు. సహజవాయువు, పెట్రోలియం రంగంలో రూ.21,476 కోట్లు చూపారని, అందులో రూ.21,127 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని వివరించారు. ఇప్పుడు కేవలం రూ.224 కోట్లు అదనంగా కేటాయించారన్నారు.