అర్జునావతారంలో నితీష్.. మోదీపై యుద్ధం
వారణాసి: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మహాభారతంలో అర్జునుడిలా దర్శనమిచ్చారు. అది కూడా ప్రధాని నరేంద్రమోదీ నియోజవర్గంలో.. సరిగ్గా వారణాసికి 30 కిలో మీటర్ల దూరంలో.. శ్రీకృష్ణుడిగా శరద్ యాదవ్ రథాన్ని నడుపుతుండగా అర్జునుడిగా తన విల్లమ్ములో నుంచి భాణాన్ని తీస్తున్న పోజులో నితీశ్ కుమార్ కనిపించారు. ఈ మేరకు ఫ్లెక్లీలను ప్రధాని నియోజక వర్గంలో పెట్టడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఫ్లెక్లీలకు ట్యాగ్ లైన్ గా.. 'ప్రధాని నరేంద్రమోదీపైన మత శక్తులపైన యుద్ధం' అని పెట్టారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో జేడీయూ భారీ ఎత్తున ప్రచారానికి దిగేందుకు తెరలేపింది. బిహార్ లో దెబ్బకొట్టినట్లుగానే ప్రధాని మోదీని ఉత్తరప్రదేశ్లో లౌకికవాదులను ఏకం చేసి దెబ్బకొట్టాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఉత్తరప్రదేశ్ లోని పింద్రా నుంచి తన ప్రస్తానం ప్రారంభించేందుకు జేడీయూ సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడ అందరినీ ఆకర్షించేలా పోస్టర్లు వేశారు.. ఫ్లెక్సీలు పెట్టారు. ఈ రోజు ఇక్కడ జరగబేయే సమావేశంలో నితీశ్ పాల్గొంటారు.