మళ్లీ షాకిచ్చిన నితీష్.. లాలూ కేసుపై సైలెన్స్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మిత్రపక్షాలకు షాకులమీద షాకులిస్తున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఝలక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా అలాగే చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో నిలబెట్టే అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా మంగళవారం భేటీ అవ్వాలని నిర్ణయించుకోగా ఆ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ నితీష్ చెప్పారు. దీంతో మరోసారి అసలు నితీష్ మనసులో ఏముందని, ఆయన ఇక మిత్రపక్షాలకు పూర్తిగా దూరమైనట్లేనా అని చర్చలు మొదలయ్యాయి.
గతంలో కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏర్పాటుచేసిన సమావేశానికి నితీష్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలంతా నితీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయన్ను ఏ ఒక్కరూ తిట్టొద్దని ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తమకే మద్దతు ఇస్తున్నారని రాహుల్ సొంత పార్టీ నేతలకు చెప్పారు. అయితే, తాజాగా మాత్రం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే సమావేశానికి తాను హాజరుకాబోనంటూ నితీష్ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆ ఎన్నికలపై కూడా ఆయన ఎన్డీయేకే జై అంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే, ప్రస్తుతం నితీష్‌కు వైరల్ ఫీవర్ ఉందని, ఆ కారణంగానే ఆ సమావేశానికి హాజరుకావడం లేదని ఆయన కార్యాలయం చెబుతున్నా అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, లాలూ ఇంటిపై సీబీఐ దాడుల విషయంలో స్పందించేందుకు కూడా నితీష్ నిరాకరించడం గమనార్హం.