సీఎం పీఠం కోసం నితీష్ ముమ్మర ప్రయత్నం
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠంపై కూర్చునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్తో కలసి నితీష్ గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ ఎదుట తనకు మద్దతు ఇస్తున్న 130 ఎమ్మెల్యేలను హాజరుపరిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఉందని, గవర్నర్ అవకాశం ఇస్తే మెజార్టీ నిరూపించుకుంటామని నితీష్ చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి గవర్నర్ను కలసి వెళ్లిన 15 నిమిషాల తర్వాత నితీష్ బృందం వెళ్లింది. గవర్నర్ తమకు అవకాశం ఇవ్వకుంటే 130 ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. జేడీయూ నుంచి జీతన్ రామ్ను బహిష్కరించారు. కాగా రాజీనామా చేసేందుకు తిరస్కరిస్తున్న మంఝి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నారు.