నేడు బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు నితీశ్ ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు లోక్సభ, రాజ్యసభలోని ఆ పార్టీ నేతలుకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని ఇప్పటికే నితీశ్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఇంతకుముందే ఈ రోజు నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హాజరవుతారని నితీశ్కు మోదీ చెప్పినట్లు సమాచారం. వెంకయ్యతోపాటు మరో కేంద్ర మంత్రి, బిహార్కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా నితీష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలిసింది.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. డిప్యూటీ సీఎం పదవి తమ కుమారుడు లేదా కుమార్తెకు ఇవ్వాలని ఇప్పటికే లాలూ...నితీశ్ను కోరినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నితీశ్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.