
బిహార్ సీఎం నితీష్ కుమార్ (ఫైల్ ఫోటో)
సాక్షి, పాట్నా : ఎన్‌డీఏకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) దూరం కానుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. నోట్లరద్దుపై యూటర్న్ తీసుకున్న నితీష్ ఇటీవల పలు సందర్భాల్లో ఎన్‌డీఏను ఇరకాటంలో పెట్టే చర్యలు తీసుకోవడం ఇవే సందేహాలను ముందుకుతెస్తున్నాయి. తాజాగా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి ఒక్కరోజు ముందు నితీష్ కేంద్రానికి షాక్ ఇచ్చారు. పంట నష్టం వాటిల్లితే రైతులకు పరిహారం చెల్లించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) స్ధానంలో బిహార్ ప్రభుత్వం బిహార్ రాష్ట్ర ఫసల్ సహత్య యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అతుల్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకం రైతుల కంటే బీమా కంపెనీలకే మేలు చేసేలా ఉందని ఆయన ఆరోపించారు. గత పథకంలో రైతులు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఈ పథకంలో రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం వాటిల్లితే రైతులు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారని తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై జూన్ 7న జరగనున్న కీలక భేటీకి ముందు నితీష్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. జేడీ(యూ) ఎన్‌డీఏకు దూరమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ-జేడీయూ మధ్య సంబంధాలు దెబ్బతినలేదని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీలో తమ బలం ఆధారంగా సీట్ల సర్ధుబాటు ఉండాలని జేడీయూ డిమాండ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment