సంచలన నిర్ణయం తీసుకున్నారు!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తూ దాదాపు పదివేల మంది కలిసి తమ ఆలోచనను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. కనీస అవసరమైన మరుగుదొడ్డి లేని ఇంటికి తమ ఆడబిడ్డల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. టాయిలెట్ సౌకర్యం ఉన్నకుటుంబాల్లో అబ్బాయిలకు మాత్రమే తమ బిడ్డల్నిచ్చి పెళ్లి చేయించాలని తీర్మానించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని 52 గ్రామ పంచాయతీల్లో హర్బా తెగవారు ఒక దృఢమైన తీర్మానం చేసుకున్నారు. 'అగర్ శౌచాలయ్ నహీతో.. బేటీ నహీ ఔర్ రోటీ నహీ' అంటూ ఆదేశాలు జారీ చేశారు.
గ్రామపంచాయతీల్లోని పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దడానికి, టాయిలెట్ల నిర్మాణం, వాడకంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. పరిశుభ్ర వాతావరణం, అందరికీ ఆరోగ్యం లక్ష్యసాధన కోసం ఈ ప్రతిజ్ఞ చేశామని హల్బా సమాజ్ ప్రతినిధి వీరేంద్ర మిశ్రా తెలిపారు. మిగిలినవారికి తమ నిర్ణయం స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నారు. మరోవైపు ఈ జిల్లా 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన ఫ్రీ జిల్లాగా రికార్డు సొంతం చేసుకోనున్నట్టు సమాచారం.