విద్యార్థులకు 'నది' కష్టాలు! | No Bridge On Tamil Nadu River, Children Cross It On Foot To Reach School | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు 'నది' కష్టాలు!

Published Mon, Jul 11 2016 9:43 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

విద్యార్థులకు 'నది' కష్టాలు! - Sakshi

విద్యార్థులకు 'నది' కష్టాలు!

చెన్నైః ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళాలంటే అక్కడి విద్యార్థులకు నది కష్టాలు తప్పడంలేదు. ఎప్పుడూ మోకాల్లోతు దాటి ఉండే నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కోసారి నీటి ఉధృతి పెరిగితే నడుములు దాటి కూడా నీరు ప్రవహిస్తుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నీటిలో నడుస్తూ స్కూలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తమిళనాడు విద్యార్థులకు దినదినగండంగా మారుతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి నదికి ఆవలివైపున ఉన్న స్కూలును చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఏళ్ళతరబడి బ్రిడ్జి నిర్మాణంకోసం ఆ ప్రాంత వాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునేవారే కరువయ్యారు.

తమిళనాడు క్రిషగిరి జిల్లా బోడూరు గ్రామ ప్రాంతంలోని విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జి లేక, మోకాల్లోతు నీటిలోనే నడుచుకుంటూ వెడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. బోడూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది విద్యార్థులు పెన్నార్ నదిని దాటి స్కూలుకు వెడుతుంటారు. ఆయా గ్రామాల్లోని విద్యార్థులే కాక గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం నిత్యావసరాలకోసం పక్క గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటక తప్పడం లేదు. కనీసం 3000 మంది ప్రయాణీకులు ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

బోడూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నదిపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్ కు చేర్చాలన్నా బ్రిడ్జిని చేరుకోవాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని,  రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించాలన్నా నదిని దాటడం ఎంతో కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే క్రిషగిరి జిల్లాలో నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత రూ.1.5 కోట్ల నిధులు కేటాయించారని, నిర్మాణంకోసం అధికారులకు ఆదేశాలు కూడ జారీ చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి చెప్తున్నారు. నదిపై బ్రిడ్జిలేక, నీరు ఉధృతంగా ఉన్నసమయంలో  సంవత్సరంలో సుమారు 100 రోజులపాటు పాఠశాలకు హాజరుకాలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరో రెండేళ్ళలో బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండగా... అధికారులు ఇచ్చే హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement