గుజరాత్లో రైతు ఆత్మహత్యలపై కేంద్రం కాకి లెక్కలు చెబుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకలకు పొంతన లేకుండా పోతోంది.
అహ్మదాబాద్: గుజరాత్లో రైతు ఆత్మహత్యలపై కేంద్రం కాకి లెక్కలు చెబుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకలకు పొంతన లేకుండా పోతోంది. గుజరాత్‌లో 2003-2012 మధ్య కేవలం ఒకే ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం ) ప్రకటించింది. కానీ, రాష్ట్ర హోంశాఖ రికార్డుల్లో మాత్రం 413మంది రైతులు పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వివరాలు ఉన్నాయి.
భరత్ సింగ్ ఝాలా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఇక, ఈ రెండు సమాధానాలకు భిన్నంగా రాజ్యసభలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయక మంత్రి మాత్రం 2013-14 సంవత్సరంలోనే 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. అయితే, 2013లో 582మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2014లో 45మంది రైతులు, 555 రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.
కాగా, ఓ పక్క రాష్ట్రంలో వందల సంఖ్యలో రైతులు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలు ఉంటే కేవలం ఒక్క రైతే ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడమేనంటూ భరత్ సింగ్ ఝాలా అనే సమాచార హక్కు చట్ట కార్యకర్త అన్నారు. ఇదిలాఉండగా, ఇదే సమాచారం కోసం గుజరాత్కు చెందిన మరో కార్యకర్త దరఖాస్తుకోగా 2005-2014 మధ్య 413 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ వద్ద వివరాలున్నాయంటూ పోలీసు శాఖ వివరాలు వెల్లడించింది.