ఆహార బిల్లుకు బ్రేక్! | No Food Security Bill today as BJP targets Prime minister Manmohan singh on missing coal files | Sakshi
Sakshi News home page

ఆహార బిల్లుకు బ్రేక్!

Published Wed, Aug 21 2013 1:38 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఆహార బిల్లుకు బ్రేక్! - Sakshi

ఆహార బిల్లుకు బ్రేక్!

సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ జయంతి రోజు ప్రతిష్టాత్మక ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేసుకుందామనుకున్న పాలకపక్షం ఆశలకు ప్రతిపక్షాలు గండికొట్టాయి. అవసరమైతే సొంత పార్టీ ఎంపీలను సైతం సస్పెండ్ చేసి బిల్లును గట్టెక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. మంగళవారం రాష్ట్ర విభజనతోపాటు బొగ్గు స్కాం, చుక్కలంటిన ఉల్లి ధరలు, శ్రీలంకలో తమిళుల సమస్య.. తదితర అంశాలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లడంతో ఆహార భద్రత బిల్లు చర్చకు నోచుకోలేదు. బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు గల్లంతవడంపై బీజేపీ లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం సృష్టించింది.
 
 దీనిపై ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను స్తంభింపజేసింది. దీనిపై రభస కొనసాగుతుండగానే ఉల్లి ధరలపై అన్నా డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, శ్రీలంకలో తమిళుల ఊచకోతకు నిరసనగా కొలంబోలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల శిఖరాగ్ర సభను బహిష్కరించాలన్న డిమాండ్‌తో డీఎంకే సభ్యులు గందరగోళం సృష్టించడంతో ఉభయసభలు పలుమార్లు వాయిదా  పడ్డాయి. గందరగోళ పరిస్థితుల మధ్యే బొగ్గు మంత్రిత్వశాఖలో ఫైళ్లు కనిపించకుండా పోవడంపై రాజ్యసభలో బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ ప్రకటన చేయడం, లోక్‌సభలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం మినహా ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి.
 
 ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు లాల్‌జాన్ బాషాకు సభ నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆహార భద్రత బిల్లుపై చర్చను ప్రారంభించేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇదే సమయంలో నలుగురు టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి.. రాష్ట్రానికి న్యాయం చేయండి’ అని నినాదాలు చేస్తూ సభామధ్యలోకి వెళ్లారు. వీరికి మద్దతుగా సీమాంధ్రకు చెందిన ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల నుంచి ముందువరుసల్లోకి వచ్చారు. దీంతో స్పీకర్ సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు.
 
  తిరిగి సమావేశమైన తర్వాత సీమాంధ్ర ఎంపీల నిరసనలకు తోడు సీపీఐ, సీపీఎం, డీఎంకే సభ్యులు కూడా వివిధ అంశాలపై పోడియం వద్దకు చేరారు. ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ బొగ్గు మంత్రిత్వశాఖ ఫైళ్లు గల్లంతు అంశాన్ని ప్రస్తావించడంతో గందరగోళం మరింత పెరిగింది. ఫైళ్లు మాయం కావడం సిగ్గుచేటు అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు, రెండు గంటలకు తిరిగి సమావేశమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సభను గురువారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభలో కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. నినాదాలు, ప్రతినినాదాల మధ్య మంత్రి జైశ్వాల్ బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై ప్రకటన చేశారు. అయినా బీజేపీ సభ్యులు ప్రధాని సభకు రావాల్సిందేనంటూ అడ్డుకోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం పార్లమెంట్‌కు సెలవు ప్రకటించారు.
 
 ఏటా మూడు లక్షల శిశు మరణాలు
 దేశంలో ఏటా జన్మిస్తున్న చిన్నారుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా పుట్టిన 24 గంటల్లోనే మరణిస్తుండగా.. 56 వేల మంది తల్లులు కూడా మృతిచెందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్  మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.. ‘స్టేట్ ఆఫ్ వరల్డ్స్ మదర్’ నివేదికను ఉటంకిస్తూ  ఆయన ఈ వివరాలు తెలిపారు. మధ్యాహ్నభోజనం, అంగన్‌వాడీ కేంద్రాలు, పౌష్టికాహారం, మంచినీరు, పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్షకు ప్రత్యేకంగా గ్రామసభలను నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పిల్లల అంశాలకు సంబంధించి జూలై, ఆగస్టుల్లో.. మహిళలకు సంబంధించి అక్టోబర్, నవంబర్‌ల్లో ఈ గ్రామసభలను నిర్వహించాల్సిందిగా సూచించామని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి కిషోర్ చంద్రదేవ్ లోక్‌సభలో చెప్పారు.
 
 ఉల్లి ఎగుమతుల నియంత్రణకు చర్యలు..
 ఉల్లి ధరలు చుక్కలను తాకుతుండడంతో.. ఎగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 13 ప్రభుత్వ సంస్థలను కెనలైజింగ్ ఏజెన్సీలు (మళ్లింపు సంస్థలు)గా నిర్ణయించింది. దాని ప్రకారం ఉల్లిని ఈ సంస్థల ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ వివరాలను మంగళవారం కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి పురందేశ్వరి లోక్‌సభలో వెల్లడించారు. మన రాష్ట్రానికి చెందిన ‘ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్’ కూడా ఆ జాబితాలో ఉంది.
 
 గల్లంతైన భద్రతా సిబ్బందిలో 54 మంది పాక్ జైళ్లలో!
 పాకిస్థాన్‌తో జరిగిన 1965, 1971 యుద్ధాల సమయంలో కనిపించకుండా పోయిన భద్రతా సిబ్బందిలో 54 మంది పాకిస్థాన్ జైళ్లలో ఉన్నట్లుగా భావిస్తున్నామని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ లోక్‌సభలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement