
మేనిఫెస్టో లేదు.. విజన్ డాక్యుమెంటే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తాము మేనిఫెస్టో ఏదీ విడుదల చేయబోమని, కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే ఇస్తామని బీజేపీ తెలిపింది. ఆ విజన్ డాక్యుమెంట్ను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కలిసి విడుదల చేస్తారని పార్టీ నాయకులు చెప్పారు.
'బీజేపీ ఈసారి మేనిఫెస్టో విడుదల చేయదు. ప్రధానమంత్రి మోదీ, సీఎం అభ్యర్థి బేడీ కలిసి విజన్ డాక్యుమెంట్ మాత్రమే విడుదల చేస్తారు' అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈనెల 31, ఫిబ్రవరి 1, 3, 4 తేదీల్లో మోదీ నాలుగు ర్యాలీల్లో ప్రసంగిస్తారన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రతిరోజూ తమ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కు ఐదు ప్రశ్నలు వేస్తుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు 10న వెల్లడవుతాయి.