జడ్జీలను ‘మై లార్డ్’ అనక్కర్లేదు!
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’, ‘యువరానర్’ వంటి పదాలతో సంబోధించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జడ్జీలను మర్యాదపూర్వకంగా మాత్రమే సంబోధించాలని పేర్కొంది. ‘‘న్యాయమూర్తులను ఆ పదాలతోనే సంబోధించాలని మేం ఎప్పుడు చెప్పాం? మమ్మల్ని మర్యాదపూర్వకంగా సంబోధిస్తే చాలు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బొబ్డేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులను ఆయా పదాలతో సంబోధించడం బ్రిటిష్ పాలననాటి పరిస్థితులకు, బానిసత్వానికి నిదర్శనమని.. అందువల్ల కోర్టుల్లో ఆయా పదాలతో జడ్జీలను సంబోధించడాన్ని నిషేధించాలని కోరుతూ శివ సాగర్ తివారీ అనే అడ్వొకేట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అలాగే ఆయా పదాలను న్యాయమూర్తులు అంగీకరించకూడదంటూ కోర్టులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
ఈ వ్యాజ్యాన్ని గతేడాది నవంబర్ 11న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, న్యాయమూర్తి జస్టిస్ రంజనా గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఈ విచారణ నుంచి జస్టిస్ గొగోయ్ తప్పుకొని, వ్యాజ్యాన్ని జస్టిస్ దత్తు ధర్మాసనానికి బదిలీ చేశారు. సోమవారం దీనిపై జస్టిస్ దత్తు నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే మమ్మల్ని (జడ్జీలను) సంబోధించండి. సర్ అని సంబోధించండి.. యువరానర్ అనండి.. లార్డ్‌షిప్ అని పిలవండి.. అవన్నీ అంగీకారమే. సర్ అంటారా? యువరానర్ అంటారా? యువర్ లార్డ్‌షిప్ అంటారా అనేది అడ్వొకేట్ల ఇష్టం. గౌరవంగా, మర్యాదపూర్వకంగా సంబోధిస్తే చాలు. అంతేకానీ, ఫలానా విధంగానే సంబోధించాలని మేం ఎలా ఆదేశాలివ్వగలం’ అని పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ.. వ్యాజ్యాన్ని తిరస్కరించింది.