బియాస్ నదిలో ఫలించని అన్వేషణ
సిమ్లా: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు శనివారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. నదిలో 450 మంది జవాన్లతో ప్రతి అంగుళం గాలించామని మండి కలెక్టర్ దేవేష్ కుమార్ చెప్పారు.
లార్జీ డ్యామ్ దిగువన నదిలో మూడు కిలో మీటర్ల వరకు ఆపరేషన్ జరిగినట్టు చెప్పారు. ఆదివారం కూడా ఆపరేషన్ కొనసాగించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. పాండో డ్యామ్కు ఎగువన తొమ్మిది కిలో మీటర్ల పరిధిలో మరోసారి గాలిస్తామని చెప్పారు. అత్యాధునిక స్కైట్ స్కానర్ రప్పిస్తున్నామని, శవాలు బురదలో ఉన్నా గుర్తించేందుకు వీలవుతుందని తెలిపారు. మూడో ప్రత్యామ్నాయంగా సోమవారం పాండో డ్యామ్లో ఉన్న నీటిని ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపడుతామని కలెక్టర్ చెప్పారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీయగా, మిగిలిన వారీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.