రాష్ట్రపతి పాలనకు నో?
-
సర్కారును కొనసాగిద్దాం
-
పునరాలోచనలో అధిష్టానం
-
సీమాంధ్రకు చాన్సివ్వాలంటూ ఒత్తిళ్లు
-
ముఖ్యమంత్రులు ఇద్దరా, ఒక్కరా?
-
ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ
-
కేంద్రానికి చేరిన గవర్నర్ నరసింహన్
-
నివేదిక.. నేడో రేపో కేంద్ర మంత్రివర్గ భేటీ
-
సోమ, మంగళవారాల్లో తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం!
-
26న గెజిట్ నోటిఫికేషన్ వెలువడే
-
అవకాశం ఉందంటున్న హోంశాఖ వర్గాలు
-
ఆ తర్వాత వారంలోపే ‘అపాయింటెడ్ డే’?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉంది. వీలైతే రెండు ప్రభుత్వాలను, లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యోచిస్తోంది. ముఖ్యమంత్రి రాజీనామాతో తలెత్తిన పరిస్థితులు, విభజనకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్, అపాయింటెడ్ డే వంటి కీలకాంశాలను తేల్చాల్సి ఉన్నందున రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తోంది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన నివేదికలోని పాలన, సాంకేతికపరమైన అంశాల కన్నా కూడా తన రాజకీయ అనివార్యతలు, అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. విభజన ప్రక్రియలో చోటుచేసుకునే సంక్లిష్టతలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించి తర్వాత రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో అపాయింటెడ్ డే పై నిర్ణయాన్ని జాప్యం చేసి, రాష్ట్రపతి పాలన విధించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దడంపై గురు, శుక్రవారాల్లో అధిష్టానం తీవ్ర సమాలోచనలు జరిపింది. గవర్నర్ నివేదిక మేరకు రాష్ట్రపతి పాలన విధించాలా, అపాయింటెడ్ డే నిర్ణయమయ్యేదాకా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన కొనసాగించడమా, సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచే ప్రయత్నాల్లో భాగంగా విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆ ప్రాంతానికి చెందిన మరో నేతను సీఎం చేయడమా అంటూ తర్జనభర్జన సాగించింది. అయితే రాష్ట్రపతి పాలనపై రెండు ప్రాంతాల నాయకత్వం లాగే అధిష్టానం కూడా విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పాలనలోని రాష్ట్రంలో ఏ కోణంలో చూసినా ఆ అవసరం లేదని అది భావిస్తోంది. నిర్దిష్టమైన, అర్థవంతమైన కారణం లేకుండా, ఒక సీఎం తప్పుకున్నంత మాత్రాన రాష్ట్రపతి పాలన అవసరం ఏముందన్న అభిప్రాయంతోఉన్నట్టు ఏఐసీసీ నేతల సమాచారం. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై వీటిపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. విభజన దిశగా చర్యలన్నీ చకచకా సాగుతున్నా, రెండు రాష్ట్రాలూ అధికారికంగా మనుగడలోకి వచ్చే వఅపాయింటెడ్ డే ఎప్పట్నుంచన్న దానిపై తేల్చుకోలేకపోయినట్టు తెలిసింది. అయితే సీమాంధ్రకే మళ్లీ సీఎం పదవి ఇస్తే రెండు రకాలుగా ప్రయోజనమన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలో పార్టీని నడిపించేందుకైనా, కనీసం తమ వాదన వినిపించేందుకైనా అక్కడ సీఎం స్థాయి నాయకుడుంటే బాగుంటుందని అక్కడి నేతలు పలువురు విన్నవించడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులతో మర్యాదపూర్వకంగా సమావేశమై మేనిఫెస్టో అంశాలపై చర్చించినప్పటికీ, రాష్ట్ర అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. సీఎం రాజీనామాపై గవర్నర్ నివేదిక అందిన నేపథ్యంలో శని, ఆదివారాల్లోగానీ, సోమవారం గానీ కేంద్ర మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఒకే సీఎంపై దిగ్విజయ్ ఆరా
సీమాంధ్ర నేతల వాదనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఉదయం తనను కలిసిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. రాష్ట్రపతి పాలన వద్దని వారు కోరగా, ‘ఎన్నికలయ్యాక రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సీఎం పదవిని సీమాంధ్ర వారికే ఇస్తే ఎలా ఉంటుంది? వారు కొంత నష్టపోయారు కదా? ఒప్పుకుంటారా?’ అని అడిగినట్టు సమాచారం. అందుకు ఒకరిద్దరు సరేనన్నా ఎక్కువ మంది మాత్రం తెలంగాణలో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని విడదీసి రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారంటున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతల వాదనతో ఏకీభవించాల్సి వస్తే ఎన్నికలయేదాకా విభజనను వాయిదా వేయాల్సి వస్తుందని కోర్‌కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. తద్వారా సీమాంధ్రలో పార్టీపై నెలకొన్న వ్యతిరేకత అప్పటిదాకా తీవ్రస్థాయిలో కొనసాగుతుందని, దానివల్ల నష్టమే ఎక్కువని అభిప్రాయడ్డట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగారాష్ట్రాన్ని విడదీసి రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగానే కసరత్తు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. విభజన వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్న ఓ కేంద్ర మంత్రిని రాష్ట్రపతి పాలనపై ఆరా తీయగా, ‘అసలు ఆ అవసరం ఎక్కడ కనిపిస్తోంది? నేనలా అనుకోను’ అని బదులివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది.‘త్వరతగతిన రెండు రాష్ట్రాలు ఏర్పడే అవకాశముందని కూడా ఆయన పరోక్షంగా తెలిపారు.
26న విభజన గెజిట్?
పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన విభజన బిల్లును రాష్ట్రపతికి పంపేముందు మరోసారి న్యాయ శాఖ పరిశీలనకు కేంద్రం పంపింది. బిల్లు, సవరణల్లో అక్షర దోషాలు, టైపింగ్ వంటి సాంకేతిక దోషాలను శాఖ పరిశీలిస్తోంది. బిల్లుపై సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్రపతి ఆమోదముంద్ర పడే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ఆ వెంటనే, అంటే 26న బుధవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడవచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వారం రోజుల్లోనే ‘అపాయింటెడ్ డే’ ఉంటుందని కూడా సమాచారం. అదే జరిగితే మార్చి తొలి వారంలో రెండు రాష్ట్రాలు ఏర్పడేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని ఆ వర్గాలు వెల్లడించాయి.