
'మా రాష్ట్రంలో యోగా డే నిర్వహించం'
జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యోగా డే కార్యక్రమాన్ని పంబాబ్ లో చేపట్టడంలేదని అకాలీదళ్ ప్రభుత్వం నిర్ణయించింది.
చండీగఢ్(పంజాబ్): జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యోగా డే కార్యక్రమాన్ని పంబాబ్ లో చేపట్టడంలేదని అకాలీదళ్ ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ మిత్రకూటమి అయిన అకాలీదళ్ పంజాబ్ లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని మోదీపై గుర్రుగుర్రుగా ఉన్నారని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. పవిత్ర నగరం ఆనంద్పూర్ సాహిబ్ సందర్శనకు రావాల్సిందిగా మోదీని పంబాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆహ్వానించారు. మోదీ ఈ సందర్శనను రద్దుచేసుకున్న కారణంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్న అకాలీదళ్ 'యోగా డే' నిర్వహించేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది. విద్యార్థులంతా యోగా డే కు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తున్నప్పటికీ, వేడుకకు దూరంగా ఉంటామన్న అకాలీదళ్ రాష్ట్ర విద్యాసంస్థలకు ఈ విషయాన్ని తెలపలేదు. పైగా విద్యార్థులకు జూన్ 30 వరకు వేసవి సెలవులలో ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.
1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న టెర్రరిస్టు దేవిందర్ సింగ్ బుల్లార్ను స్థానిక తీహార్ జైలు నుంచి పంబాబ్ లోని అమృత్సర్ జైలుకు తరలించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, అకాలీదళ్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తుంది. బుల్లార్ విషయాన్ని పంజాబ్ బీజేపీ నేతలు కొందరు మోదీతో సమావేశమై చర్చించడంతో ఆయన ఈ కార్యక్రయాన్ని రద్దుచేసుకున్నారని తెలుస్తుంది. మతపరమైన అంశాలు ఇందులో భాగమైనవని వారు ప్రధానికి తెలపడంతో ఆయన ఆనంద్పూర్ సాహిబ్ పట్టణ సందర్శనను రద్దుచేసుకున్నారని అకాలీదళ్ పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు. సిక్కుల గురువు గోబింద్ సింగ్ 1699లో స్థాపించిన పవిత్ర నగరం ఆనంద్పూర్ 315వ వార్షికోత్సవానికి ప్రధానిని ప్రకాశ్ సింగ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, బుల్లార్ నేపథ్యంలో ఆయన ఈ సందర్శన రద్దు చేసుకోగా, పంజాబ్ ప్రభుత్వం మాత్రం పట్టుదలకు పోయి యోగా డే కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.