
నోయిడా: తనను కిడ్నాప్ చేసి, అనంతరం కదులుతున్న కారులో రేప్ చేసి ఢిల్లీలో వదిలిపెట్టి పోయారని ఆరోపించిన ఓ మహిళ ఆ తరువాత మాట మార్చింది. కోపంతోనే ఇద్దరిపై తప్పుడు కేసు పెట్టానని పోలీసులకు చెప్పింది. అంతకు ముందు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్‌రేప్ కేసు నమోదుచేశారు. నోయిడా పోలీస్ పీఆర్‌వో మనీశ్ సక్సేనా వివరాలు వెల్లడిస్తూ... తప్పుడు కేసు పెట్టినట్లు సదరు మహిళ అంగీకరించిందని అన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
మహిళ తనపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఫిర్యాదు చేసిన తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపితే పరీక్షలు చేయించుకోకుండానే ఇంటికి వెళ్లింది. ఆ తరువాత మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్య పరీక్షలకు నిరాకరించింది. అసలు పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదని వైద్యులకు తేల్చిచెప్పింది. కోపంతోనే ఇద్దరిపై తప్పుడు కేసు పెట్టినట్లు ఆమె తమకు రాతపూర్వకంగా తెలియజేసిందని సక్సేనా తెలిపారు. తనపై ఎవరూ లైంగిక దాడిచేయలేదని, ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరింది. అంతకుముందు...విధులు ముగించుకుని క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా ఓ కారు వచ్చి తన వద్ద ఆగిందని, చిరునామా అడుగుతూ అందులోని వ్యక్తులు తనను అపహరించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది.