అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముందు ప్రధానమంత్రి(పీఎం) అనే పేరును జత చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
న్యూఢిల్లీ: అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముందు ప్రధానమంత్రి(పీఎం) అనే పేరును జత చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పీఎం అని కాకుంటే జాతీయ నేతల పేర్లను జతచేసే అవకాశముంది. అలాగే, మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటిని అన్ని సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనకు ముందు చూపాలన్న నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. ఈమేరకు కేంద్ర పథకాలు, విజయాలను రాష్ట్రాల్లో, జిల్లాల్లో తెలియపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని మంత్రుల బృందం(జీఓఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి అమలు బాధ్యతను సమాచార, ప్రసార శాఖకు అప్పగించాలంది.
ప్రభుత్వ విజయాలపై రెండు వారాలకో చిత్రాన్ని రూపొందించాలని సూచించింది. కేంద్ర పథకాల ద్వారా వచ్చే గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వాలే పొందుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆ పథకాల ప్రారంభోత్సవాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండాలంది. పథకాల అమలును పర్యవేక్షించే బాధ్యతలను స్థానిక ఎంపీలకు కట్టబెట్టాలని తెలిపింది. పథకం అమలులో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించే అధికారం ఇవ్వాలని పేర్కొంది.