- అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ వెల్లడి
గాంధీనగర్: ఈ నెలాఖరులో భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా.. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో పారిస్‌లో జరగనున్న సదస్సులో చరిత్రాత్మక వాతావరణ మార్పు ఒప్పందంపై భారత్ సంతకం చేస్తుందని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.
భారత్ - అమెరికాల మధ్య 2008లోనే పౌర అణు ఇంధన సహకారంపై ఒప్పందం కుదిరినప్పటికీ.. 2010లో భారత్ చేసిన పౌర అణు బాధ్యత చట్టం కారణంగా ఆ ఒప్పందం అమలులోకి రాలేదు. అణు ప్రమాదాలు జరిగినట్లయితే దానివల్ల జరిగే నష్టానికి సంబంధిత సంస్థలే బాధ్యత వహించాలని నిబంధన విధిస్తున్న ఈ చట్టం వల్ల విదేశీ అణు ఇంధన సరఫరాదారులు భారత్‌కు అణు ఇంధనం అందించేందుకు సంశయిస్తున్నారు.
ఈ నేపధ్యంలో.. ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఒబామా పర్యటన సందర్భంగా పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి కోసం ఇరు దేశాలూ ప్రయత్నిస్తాయని కెర్రీ పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒబామా భారత పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై రక్షణ, పౌర అణు ఇంధన ఒప్పందాలతో పాటు ద్వైపాక్షిక, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారని కెర్రీ తెలిపారు.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జాన్‌కెర్రీ ఆదివారం నాడు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ భేటీ వివరాలను సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘ఒబామా పర్యటన విషయమై ప్రధాని మోదీతో నా చర్చలు ఫలవంతంగా జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై మేం సమీక్షించాం. అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం’’ అని ఆయన పేర్కొన్నారు.