
కోయంబత్తూరు: పెను తుపానుగా మారిన ఓక్కి సృష్టించిన విధ్వంసానికి తమిళనాడు, కేరళలు విలవిలలాడాయి. ఓక్కి తుపాను దెబ్బకి ప్రజలతో పాటూ జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కోయంబత్తూరులోని పెరియనాయకన్‌పాల్యంలో ఓ ఏనుగు తన పిల్ల ఏనుగుతో కలిసి ఆహారం కోసం ఓ ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. అయితే ఆహారం దొరక్కపోవడంతో ఆ ప్రాంతంలో ఎలాంటి నష్టం కలిగించకుండానే రెండు ఎనుగులు నిరాశతో వెనుదిరిగాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఓక్కి తుపాను ప్రభావం దక్షిణ తమిళనాడు, కేరళ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండటంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. కన్యాకుమారి జిల్లా దారుణంగా దెబ్బతింది. అలాగే తిరునల్వేలి, తూత్తుకూడి, పుదుకోట్టై, రామనాథపురం, విరుదునగర్ జిల్లాలు నష్టపోయాయి. కావేరీ డెల్టాలో కుండపోత వర్షాలతో లక్ష ఎకరాల వరి పంట దెబ్బతింది.