చెత్తకుండీలో వెయ్యి నోట్ల కలకలం!
పుణె: కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటి నుంచీ నల్లధనం ఏదో రూపంలో బయటకు వస్తుంది. అయితే మహారాష్ట్రలోని పుణెలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వెయ్యి రూపాయల నోట్లు చెత్తకుండీలో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రూ. 52,000 విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లను పారిశుధ్య కార్మికురాలు గుర్తించింది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి డబ్బులు ఇక్కడ పడవేశారని ఓ అధికారికి చెప్పగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
శాంతా ఓవహల్ అనే మహిళా పారిశుధ్య కార్మికురాలు గురువారం ఉదయం లా కాలేజీ రోడ్డులో విధులు నిర్వహిస్తుండగా డబ్బు దొరికింది. ఈ విషయాన్ని తనపై అధికారితో కలసి దక్కన్ జింఖానా స్టేషన్ పోలీసులకు తెలిపారు. వారు వచ్చి నోట్లను పరిశీలించి.. ప్రభుత్వం రద్దు చేసిన వెయ్యి రూపాయల నోట్లేనని నిర్ధారించారు. అవినీతి రహిత భారత్ ను చేయడంతో భాగంగా ప్రధాని మోదీ రెండు రోజుల కిందట రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. నల్లధనం ఏం చేయాలో, వాటిని వాడుకలోకి తెచ్చుకోవాలో అర్థంకాక నల్ల కుబేరులతో పాటు సామాన్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.