బ్లాక్‌మనీ పెద్దలకు భారీ షాక్!
-
పన్ను పరిధిలోకి రాని నగదుకు 200శాతం పెనాల్టీ!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం కలిగి ఉన్నవారికి షాక్ తప్పదని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. ఆదాయపన్నుశాఖ (ఐటీ)కు వెల్లడించిన నగదు కన్నా ఎక్కువమొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి జరిమానా చెల్లించక తప్పదని తేల్చింది. అధికంగా ఉన్న మొత్తం నగదుకు చెల్లించాల్సిన పన్నుమొత్తంపై 200శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హంసముఖ్ అధియా స్పష్టం చేశారు.
ఈ నెల 10 నుంచి వచ్చే నెల 30వ తేదీవరకు బ్యాంకుల్లో రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువమొత్తం డిపాజిట్ అయ్యే నగదు వివరాలన్నిటినీ తెప్పించుకుని ప్రతి ఖాతాలోని వివరాలు విశ్లేషిస్తామని, డిపాజిటర్లు పెట్టిన నగదు మొత్తాన్ని, వారు చెల్లించిన ఆదాయపన్నులను బేరిజు వేసి.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
చిన్నవ్యాపారులకు, కార్మికులకు ఊరట
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్న వ్యాపారులు, కార్మికులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హంసముఖ్ అధియా భరోసా ఇచ్చారు. చిన్న వ్యాపారులు, కార్మికులు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చునని, ఈ నగదు మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి రాదు కాబట్టి, వారు ఎలాంటి చింత పడాల్సిన అవసరం లేదని చెప్పారు.