సీఎం ఆస్తి కంటే కొడుకు ఆస్తే ఎక్కువ
► లాలు ఇద్దరు కొడుకుల కంటే నితీష్ ఆస్తే తక్కువ
► కన్న కొడుకు ఆస్తిలో ఆయనది మూడో వంతే
► ఓ మంత్రి గారి ఆస్తి రూ. 8.4 లక్షలేనట
పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తుల వివరాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కుమారుడి ఆస్తి విలువ నితీష్ ఆస్తి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. నితీష్ ఆస్తుల విలువ రూ.59.3 లక్షలు కాగా, కుమారుడు నిశాంత్ కుమార్ రూ. 2.14 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలు ప్రసాద్ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రాపర్టీ విలువ సీఎం ఆస్తి కంటే దాదాపు రెట్టింపు ఉంది. తేజస్వి ఆస్తుల విలువ రూ. 1.12 కోట్లు.
సొంత వాహనం లేని డిప్యూటీ సీఎం
నూతన సంవత్సరం ప్రారంభం రోజున బిహార్ మంత్రులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వివరాలు వెలువడ్డాయి. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తనకు సొంత వాహనం లేదని చెప్పారు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారానే తాను ఆ డబ్బు సంపాదించినట్లు తేజస్వి వెల్లడించారు. తేజస్వి అన్న, మంత్రి తేజ్ ప్రతాప్ రూ.1.5 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. తేజ్ ప్రతాప్‌కు రూ.79.2 లక్షల స్థిరాస్తి, రూ. 30 లక్షల బీఎమ్డబ్ల్యూ కారు, రూ.15.4 లక్షల విలువ చేసే బైక్ ఉన్నాయి. సీఎం నితీష్ ఆస్తులు రూ.12 లక్షలు పెరగగా, కుమారుడు నిశాంత్ ప్రాపర్టీ విలువ కోటి రూపాయలకు పైగా పెరిగింది. ఒక స్పోర్ట్స్ కారు, ల్యాప్ టాప్, కంప్యూటర్ సెట్, ఏసీ, ట్రేడ్ మిల్, వాషింగ్ మిషన్ ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు.
రిచెస్ట్.. పూరెస్ట్ మినిస్టర్స్
జల వనరుల శాఖ మంత్రి లల్లన్ సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 4.4 కోట్లు. కాగా, చివరి స్థానంలో మంత్రి అనితాదేవి ఉన్నారు. ఆస్తుల విలువ రూ.8.4 లక్షలతో అనితా దేవి చిట్టచివర నిలిచారు.