మళ్లీ మహిళకే పట్టం | once again Woman to be crowned | Sakshi
Sakshi News home page

మళ్లీ మహిళకే పట్టం

Published Sat, Jun 7 2014 4:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మళ్లీ మహిళకే పట్టం - Sakshi

మళ్లీ మహిళకే పట్టం

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ఎనిమిదోసారిగా ఎంపీగా ఎన్నికైన 71 ఏళ్ల మహాజన్ పేరును.. స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ బలపరిచారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఇలాంటివే మరో 13 తీర్మానాలను ప్రతిపాదించాయి. ప్రతిపక్షాలు కూడా మహాజన్‌కు మద్దతు తెలపడంతో ప్రోటెం స్పీకర్ కమల్‌నాథ్ మూజువాణి ఓటుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రధాని, అద్వానీ, వెంకయ్యనాయుడు, అనంత్ గీతే(శివసేన), ఎం.తంబిదురై(అన్నా డీఎంకే)లతోపాటు విపక్ష నేతలు మల్లిఖార్జున ఖర్గే(కాంగ్రెస్), ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), సుదీప్ బందోపాధ్యాయ(తృణమూల్‌కాంగ్రెస్)లు మహాజన్‌ను స్వయంగా స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. సభ తనకు గురుతరమైన బాధ్యతలు అప్పగించిందని, రాగద్వేషాలకు అతీతంగా సభ్యులందరికీ న్యాయం చేస్తానని స్పీకర్ స్థానంలో కూర్చున్న మహాజన్ చెప్పారు.


 పేరులోనే మిత్రత్వం ఉంది: అనంతరం ప్రధాని మోడీ సహా పలువురు నేతలు మహాజన్‌ను అభినందిస్తూ సభలో ప్రసంగించారు. పోటీ లేకుండా స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టినందుకు అన్ని పార్టీలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సుమిత్ర పేరులోనే మిత్రత్వం ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేవాలయంలాంటి చట్టసభ ఒక మహిళ ఆధ్వర్యంలో నడవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఆమె నేతృత్వంలో సభ సజావుగా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సభ సాగేందుకు స్పీకర్‌కు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ‘‘ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సభ్యురాలిగా ప్రజాజీవితం ప్రారంభించిన మహాజన్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఎనిమిదోసారి ఎంపీగా గెలిచారు. ఎన్నడూ లేని విధంగా ఈ 16వ లోక్‌సభలో ఏకంగా 315 మంది ఎంపీలు మొదటిసారి గెలిచినవారే ఉన్నారు. ఈ కొత్త రక్తం, కొత్త ఆకాంక్షలను మన మహోన్నతమైన సంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్లాలి’’ అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ‘మహాజనో యేన గతస్య పంథా’ (గొప్పవాళ్ల అడుగుజాడల్లో నడవాలి) అంటూ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు. ‘మహాజన్’లాంటి గొప్పవారు ఈ సభను నడిపితే అంతకన్నా మనకేం కావాలి..? అని అన్నారు. అనంతరం సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. స్పీకర్ సభలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘‘మీరు అందరినీ సంతృప్తిపర్చలేరని తెలుసు. కానీ ఒక పెద్దక్క తరహాలో పార్టీలు చిన్నవైనా, పెద్దవైనా వాటి ప్రయోజనాలను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు.
 మన్మోహన్ అభినందనలు: స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమెకు ఒక లేఖ పంపారు. సుమిత్ర అపార అనుభవం సభకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

‘ప్రతిపక్ష హోదా’పై ఆచితూచి...

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కల్పిస్తారా లేదా అన్న అంశంపై కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఆచితూచి స్పందించారు. ‘‘దీనిపై చర్చించాల్సి ఉంది. గతంలో ఉన్న సంప్రదాయాలను ఓసారి పరిశీలించాలి. కొంత అధ్యయనం చేయాలి. తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆమె చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్దిపాటి సమయమే ఉన్నందున ప్రస్తుత సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోకపోవచ్చని తెలిపా రు. రానున్న బడ్జెట్ సమావేశాలపై మాట్లాడుతూ.. జూలై 28 కల్లా బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సి ఉన్నందున అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంద న్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తావించ గా..‘ఒక మహిళను అయి ఉండి నేను మహిళలను ఎలా మర్చిపోతాను’ అన్నారు. కాగా, అన్ని పార్టీల మధ్య సమన్వ యం సాధించి, సభ సజావుగా సాగేందుకే కృషి చేయడమే తన తొ లి ప్రాధాన్యమని పీటీఐ ఇంటర్వ్యూలో సుమిత్ర చెప్పారు.
 
మౌలంకర్‌ను మరిపించండి
 
కొత్త స్పీకర్‌కు మన ఎంపీల అభినందనలు
 
 న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎంపీలు శుక్రవారం అభినందనలు తెలిపారు. లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మౌలంకర్ మాదిరిగా ఆమె పేరు కూడా కలకాలం నిలిచిపోవాలని టీడీపీ నేత, పౌర విమానయాన మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. సుమిత్రకు వైఎస్సార్‌సీపీ తరఫున, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నట్టు వైఎస్సార్‌సీపీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తన హుందాతనం, ఓర్పుతో సభను ఫలప్రదంగా, నిష్పాక్షికంగా నడపగలరని ఆశాభావం వెలిబుచ్చారు. తమ పార్టీ సభ్యులంతా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఐదు రోజుల వయసున్న తెలంగాణను చంటిపాపలా చూడాలని టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ తరఫున ఆమెకు అభినందనలు అందజేశారు. కమలం గుర్తున్న బీజేపీ తరఫున గెలిచిన సుమిత్ర, నీటిలోనే ఉన్నా ఆ తడిని తనకు అంటనివ్వని కమలంలా వ్యవహరిస్తారని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వెలిబుచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement