కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురూలియా జిల్లాలోని ఆర్షాలో ఆదివారం ర్యాలీ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. డీఎస్పీ స్థాయి అధికారి సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. రామనవమి సందర్భంగా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాయి. పురూలియాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయుధాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది.
వర్దమాన్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, దీని వెనక టీఎంసీ హస్తముందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీలు మమత సర్కారుకు వ్యతిరేకంగా ‘హిందువులను ఏకం చేసే’వంటూ బీజేపీ పేర్కొంది. మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ భారీ ఖడ్గాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. రామనవమి సందర్భంగా అస్త్ర పూజ చేయటం సంప్రదాయమన్నారు. బీజేపీ చేపట్టిన ర్యాలీల్లో చిన్నారుల చేతికి ఆయుధాలిచ్చారని తృణమూల్ బాలల హక్కుల అధికారులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment