పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదరుకాల్పుల్లో స్థానికుడు మృతి చెందాడు.
రాయిపూర్(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక గ్రామస్తుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద కూంబింగ్ నుంచి తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా బాసగూడ గ్రామానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఒకరు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని బిజాపూర్ ఎస్పీ కె.ఎల్.ధ్రువ్ తెలిపారు. మృతుడిని పూనెం నందుగా, క్షతగాత్రుడిని కాకెన్ సుక్లుగా గుర్తించారు. అయితే, వీరిద్దరూ మావోయిస్టులకు చెందిన జన్‌మిలీషియాకు చెందిన వారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.