
ఇప్పటికైతే రాజీ లేదు!
ఎస్పీ సంక్షోభంపై కొనసాగుతున్న ఉత్కంఠ
♦ రెండు గంటలపాటు ములాయం, అఖిలేశ్ భేటీ
♦ ఇప్పటికే సమయం మించిపోయిందని అఖిలేశ్ వర్గం నేత వ్యాఖ్య
♦ సైకిల్ గుర్తు తమదేనంటూ ఈసీని కలిసిన సీఎం వర్గం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభంపై మంగళవారం కూడా ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సైకిల్ గుర్తును తమకే కేటాయించాలంటూ అఖిలేశ్ వర్గం ఢిల్లీలో ఈసీకి విన్నవించింది. మరోవైపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ములాయం సింగ్ యాదవ్‌తో సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య రాజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సంధి యత్నాలు ఫలించలేదని అఖిలేశ్ వర్గం నేతలు తేల్చిచెప్పారు.
అఖిలేశ్ విధేయ నేతలు రాంగోపాల్ యాదవ్, నరేష్ అగర్వాల్, కిరణ్మయ్ నందలు ఎన్నికల సంఘాన్ని కలిశారు.
ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్ కొనసాగుతున్నారని, ములాయం కాదంటూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. అసలైన ఎస్పీ తమదేనని, సైకిల్ గుర్తు కూడా తమకే చెందుతుందంటూ వాదనలు వినిపించారు. ఈసీని కలసిన అనంతరం రాంగోపాల్ మాట్లాడుతూ‘ 90 శాతం మంది మద్దతిస్తున్నందున అసలైన సమాజ్‌వాదీ పార్టీ మాదే’ అని పేర్కొన్నారు. అఖిలేశ్ ఎన్నిక చెల్లదని, తానే పార్టీ అధ్యక్షుడినంటూ సోమవారం ములాయం ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే సైకిల్ గుర్తును కూడా తమ వర్గానికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫలించని సీనియర్ల ప్రయత్నాలు
తండ్రీకొడుకులు ములాయం, అఖిలేశ్‌ల మధ్య రాజీ ప్రయత్నాల వార్తలతో లక్నోలో ఉత్కంఠ ఏర్పడింది. ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ములాయం ఇంటికి వెళ్లిన అఖిలేశ్ రెండుగంటల పాటు మంతనాలు జరిపారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన శివ్‌పాల్ యాదవ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. సైకిల్ గుర్తును ఈసీ రద్దు చేస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని, ఇద్దరు చెరో అడుగు వెనక్కి తగ్గాలని ఆజంఖాన్ వంటి సీనియర్ నేతల రాయబారం నడిపారు. ఎన్నికల గుర్తుపై ఈసీ షాక్ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనపెట్టి తండ్రీకొడుకులు రాజీ పడతారని సీనియర్లు భావించినా రాజీ కుదరలేదు. అయితే సమాజ్‌వాదీ అధ్యక్షుడిగా తప్పుకునేందుకు సిద్ధమని, ములాయంను తిరిగి ఎన్నుకుంటామని ప్రతిపాదించిన అఖిలేశ్... అందుకు ప్రతిగా అమర్‌సింగ్‌ను పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జిగా, శివ్‌పాల్‌ను జాతీయ రాజకీయాలకు పంపాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. తండ్రీకొడుకుల భేటీపై అఖిలేశ్ వర్గానికి చెందిన సీనియర్ నేత స్పందిస్తూ... ‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రస్తుత తరుణంలో రాజీకి ఎలాంటి అవకాశం లేదు. ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు.
ఈసీ కోర్టులో సమాజ్‌వాదీ భవితవ్యం
పార్టీ గుర్తుపై ఇరు వర్గాలు తలుపు తట్టడంతో బంతి ఈసీ కోర్టులోకి వచ్చి చేరింది. ఏ క్షణంలోనైనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పంచాయితీ తీర్చేందుకు ఎన్నికల సంఘానికి తగినంత సమయం లేదు. దీంతో తాత్కాలిక పరిష్కారంగా సైకిల్ గుర్తును ఫ్రీజ్ (ఎవరికీ కేటాయించకుండా) చేయాలని భావిస్తోంది. కొత్త ఎన్నికల గుర్తుపై పోటీచేయాలంటూ ఇరు వర్గాల్ని ఆదేశించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, సైకిల్ గుర్తుకు అసలైన హక్కుదారులు తేలేవరకూ ములాయం, అఖిలేశ్ వర్గాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పేర్లు కేటాయించవచ్చని భావిస్తున్నారు. నిర్ణయం వెలువరించే ముందు... ప్రత్యర్థి వర్గం వాదనలపై స్పందిం చాలంటూ ములాయం, అఖిలేశ్‌ను కోరతారని ఈసీ వర్గాలు తెలిపాయి. తుది తీర్పుకు 4 నెలలు పట్టే అవకాశముందన్నాయి.
సంధి కోసం యత్నిస్తున్నాం
ఢిల్లీలో ఉన్న ములాయం సన్నిహితుడు ఆజం ఖాన్ మాట్లాడుతూ... ఇరు వర్గాల మధ్య సంధి కోసం తాను చేయగలినదంతా చేస్తానని చెప్పారు. ‘ఏదైనా జరగొచ్చు. బహిష్కరణ ఎత్తివేస్తారని ఎవరు మాత్రం అనుకున్నారు’ అని అన్నారు.