
మంగళవారం విపక్షాల వాకౌట్‌తో బోసిపోయిన రాజ్యసభ
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాజ్యసభ కార్యకలాపాల్ని బహిష్కరించాయి. రెండు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ సమావేశం కావాల్సి ఉండగా.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండానే సభ ప్రారంభం కాగానే వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నారని, ఇది సభా నియమావళికి విరుద్ధమని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే సభలో అంతరాయాల్ని తగ్గించే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం వాయిదా వేశానని చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశమైన రాజ్యసభ.. ప్రతిపక్షాలు లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగించింది.
‘సభలో మాట్లాడేందుకు, ప్రశ్నలు లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతించనందుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభను బహిష్కరించాయి’ అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ విలేకరులకు తెలిపారు. గత రెండు రోజులుగా జీరో అవర్లో ప్రశ్నల్ని లేవనెత్తాలని ఎంపీలు లేచినప్పుడల్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నారని, గడచిన వారం నుంచి ప్రతిపక్ష సభ్యుల విషయంలో చైర్మన్ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ విషయంపై చైర్మన్‌ను కలిసి మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ విజ్ఞప్తి చేయగా.. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్‌లు నిరాకరించారు. చైర్మన్ చర్యలు సభా నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఏక్షపక్షంగా ఎవరూ సభను నడపకూడదని ఆజాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు.
ప్రతిపక్షాలు లేకుండానే కొనసాగిన చర్చ
అనంతరం సమావేశమైన రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘సభలో అంతరాయాల్ని తగ్గించేలా సభ్యుల మధ్య ఉమ్మడి బాధ్యతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం వాయిదా వేశాను’ అని చెప్పారు. తరచూ అంతరాయాలతో సభ ప్రతిష్ట, విశ్వసనీయతపై ప్రభావం పడుతోందన్నారు.
ప్రజలకు మరిన్ని ఇక్కట్లు: కాంగ్రెస్
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని ఆరోపించారు. మోదీ కేర్ పథకం కేవలం ఎన్నికల జిమ్మిక్కని, రూ. 2 వేల కోట్ల పథకం అమలు సాధ్యం కాదని అన్నారు.
నేడు ప్రసంగించనున్న మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ బుధవారం లోక్‌సభలో సమాధానమివ్వనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు.. ఉద్యోగకల్పన, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, విదేశీ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. వీటిపై ప్రధాని సమాధానమిచ్చిన అనంతరం ఓటింగ్ జరగనుంది. దీంతోపాటు గురువారం ప్రభుత్వం ముఖ్య బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున బుధ, గురువారాల్లో సభ్యులంతా హాజరుకావాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసింది.