
మనం రోబోలను తయారుచేయకూడదు!
మన విద్యావ్యవస్థ రోబోలను తయారుచేయకూడదు.. ఈ మాటలు అన్నదెవరో తెలుసా? ప్రధానమంత్ర నరేంద్రమోదీ.
మన విద్యావ్యవస్థ రోబోలను తయారుచేయకూడదు.. ఈ మాటలు అన్నదెవరో తెలుసా? ప్రధానమంత్ర నరేంద్రమోదీ. విద్యావ్యవస్థలో మంచి అధ్యాపకులుండాలని, వారు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి తప్ప.. వాళ్లను యాంత్రికంగా మార్చకూడదని ఆయన చెప్పారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
గంగానది ప్రవహించే ఈ భూమిలో సాంస్కృతిక విద్య ఉండేదని, అంతకంటే ముఖ్యంగా విద్యాసంస్కృతి అలరారిందని ప్రధాని చెప్పారు. మన పిల్లలు మంచి ఉపాధ్యాయులుగా ఎలా తయారవుతారో మనం ఆలోచించాలన్నారు. దేశంలో మంచి ఉపాధ్యాయులుంటే.. పిల్లలు వాళ్లంతట వాళ్లే బాగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఉపాధ్యాయుడు అవ్వాలనుకునే విద్యార్థి కేవలం పరీక్షల కోసం చదవడం కాకుండా.. తన ఉపాధ్యాయులను జాగ్రత్తగా పరిశీలిస్తాడని మోదీ అన్నారు. ప్రపంచానికే మంచి ఉపాధ్యాయులను మనం అందించాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం టీచర్లు కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు.