చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం | Ousted with Sasikala, TTV Dinakaran vows revenge | Sakshi
Sakshi News home page

చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం

Published Wed, Sep 13 2017 1:35 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం

చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం

► పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ తొలగింపు
► జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి
► అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
► ప్రభుత్వాన్ని కూలుస్తా: దినకరన్‌


సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి ‘చిన్నమ్మ’ శశికళ, ఆమె కుటుంబీకులను దూరం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంలు మరింత వేగం పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను మంగళవారం తొలగించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. గతంలో శశికళ తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే.శశికళ చేసిన నియామకాలు చెల్లవని పార్టీ తీర్మానించడంతో దినకరన్‌ను నియామకం కూడా రద్దైనట్లైంది.

దినకరన్‌ సృష్టించిన అడ్డంకులను అధిగమించి, హైకోర్టు అనుమతితో కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై నగరంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్నాడీఎంకేకు శాశ్వత అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్, శాశ్వత ప్రధాన కార్యదర్శి ‘అమ్మ’ జయలలితేననీ, వారి స్థానాలను మరెవ్వరితోనూ భర్తీ చేయకూడదంటూ సమావేశంలో పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తగా పార్టీలో కో–ఆర్డినేటర్, జాయింట్‌ కో–ఆర్డినేటర్‌ పదవులను సృష్టించి వాటిని వరసగా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలకు కేటాయించారు. వచ్చే ఎన్నికల వరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు. కొత్త నిబంధనల ప్రకారం పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ పదవుల్లోని వారికి ఉంటుంది.

పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ అధ్యక్షతన పళని, పన్నీర్‌ల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ల ఆధిపత్యాన్ని నిలువరించడమే లక్ష్యంగా పళని, పన్నీర్‌ల వర్గాలు ఇటీవల ఏకమైన విషయం తెలిసిందే. పళని మాట్లాడుతూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదనీ, వెయ్యి మంది దినకరన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. జయ ఉన్న సమయంలో ఏయే కట్టుబాట్లు పార్టీలో అమల్లో ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతామని పన్నీర్‌ పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు చేశారు.

మదురైలో దినకరన్‌ మంతనాలు
శశికళను పదవి నుంచి తొలగించడంతో ఆమె మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పళని, పన్నీర్‌ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మరోవైపు సర్వసభ్య సమావేశం సాగుతుండగానే దినకరన్‌ మదురైలో తన వర్గం వారితో మంతనాలు సాగించారు. సర్వసభ్య సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, కాబట్టి పళని, పన్నీర్‌  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం చెల్లదని దినకరన్‌ పేర్కొన్నారు.

ఇప్పటివరకు సీఎం మార్పు కోసం ప్రయత్నించాననీ, ఇకపై ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్‌ శపథం చేశారు. త్వరలోనే శశికళ ఆదేశాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ప్రకటించారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే తీర్పు సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని మద్రాసు హైకోర్టు చెప్పడం తెలిసిందే. శశికళను పదవి నుంచి తప్పించడం చెల్లుతుందో లేదో హైకోర్టే తన తీర్పులో చెబుతుందని దినకరన్‌ అన్నారు.

కాగా, మైసూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేల్లో ఒకరు... తాము అక్కడ బందీలుగా ఉన్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేలా విశ్వాస పరీక్ష పెట్టేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement