ఎందరో కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన తీహార్ జైలు మతసామరస్యానికి కేంద్రంగా నిలుస్తోంది. రంజాన్ పర్వదినం సందర్భంగా తీహార్‌లోని 2,300 మంది ముస్లిం ఖైదీలు రోజా ఆచరిస్తుండగా,
న్యూఢిల్లీ: ఎందరో కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన తీహార్ జైలు మతసామరస్యానికి కేంద్రంగా నిలుస్తోంది. రంజాన్ పర్వదినం సందర్భంగా తీహార్‌లోని 2,300 మంది ముస్లిం ఖైదీలు రోజా ఆచరిస్తుండగా, వీరి సహచర ఖైదీలైన 150 మంది హిందువులు కూడా ఇదే బాట పట్టారు. రంజాన్ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాస దీక్ష పాటించడాన్ని రోజా అంటారు. ఈ ఏడాది గత నెల 29 నుంచి రంజాన్ మాసం మొదలయింది. హిందూ ఖైదీలు రంజాన్ మాసం తొలిరోజు నుంచే ఉపవాసాలు ఆచరిస్తున్నారని, చివరిదాకా రోజాను కొనసాగిస్తామని చెబుతున్నారని జైలు అధికారవర్గాలు వెల్లడించాయి.
‘మతాలు వేరైనా తమ మధ్య గట్టి అనుబంధం ఉందని ఖైదీలు చాటిచెబుతున్నారు. ఇది నిజంగా అభినందనీయం. ఖైదీల ఉపవాస దీక్షలకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని తీహార్ జైలు ప్రజాసంబంధాల అధికారి సునీల్ గుప్తా అన్నారు. రోజా ఆచరించే ఖైదీలు సూర్యోదయానికి ముందే ‘సెహ్రీ’ భోజనం తీసుకోవడం, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందులో పాల్గొనడం, ప్రార్థనలు చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. సెహ్రీ, ఇఫ్తార్ కోసం పళ్లు, జిలేబీ, ఎండుపళ్లు, ఇతర ఫలహారాలను అందజేస్తున్నారు.
ఇఫ్తార్ ముగిసిన తరువాత ఖైదీలంతా తమ గదుల బయట నమాజ్ చేస్తున్నారు. విశేషమేమంటే 70 మందికిపైగా మహిళా ఖైదీలు కూడా రోజాను పాటిస్తున్నారు. ఇస్లామిక్ చాంద్రాయణ క్యాలెండర్ ప్రకారం వచ్చే తొమ్మిదో నెలలో రంజాన్ జరుపుకుంటారు. ఈ నెల చంద్రుడు కనిపించిన తొలి రోజు నుంచి రంజాన్ మాసం మొదలయినట్టుగా భావిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు ఆచరిస్తారు. ఇందుకోసం తెల్లవారుజామునే లేచి సెహ్రీ భోజనం చేసి దీక్ష మొదలుపెడతారు. సాయంత్రం భోజనాన్ని ఇఫ్తార్‌గా పిలుస్తారు.