
పీఓకేలో భూమికి అద్దె కడుతున్న ఆర్మీ!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో కొంత భూభాగాన్ని భారత ఆర్మీ అద్దెకు తీసుకుందా?. గత పదహారేళ్లుగా పీఓకేలో అద్దెకు తీసుకున్న కొంత మొత్తం భూభాగానికి భారత ఆర్మీ అద్దెను చెల్లిస్తోంది. కొంతమంది ఆర్మీ అధికారులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ) కేసు నమోదు చేసింది. భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించిన వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఖాస్రా నెంబర్లు 3000, 3035, 3041, 3045లలో గల భూమిని భారత ఆర్మీ అద్దెకు తీసుకున్నట్లు పత్రాలు లభ్యమయ్యాయని కేసును విచారిస్తున్న ఓ అధికారి చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ లక్షలాది రూపాయల డబ్బును అద్దె కింద ఆర్మీ ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పత్రాల్లో పేర్కొన్న భూమి ఓనర్ అసలు ఉన్నాడా? లేదా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్‌ఎస్ చంద్రవంశీ(సబ్-డివిజినల్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, రాజౌరి), ఖంబా గ్రామ పట్వారీ దర్శన్ కుమార్, రాజేష్ కుమార్ అనే మరో వ్యక్తికి కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.