పనామా పేపర్లలో మాల్యా!
న్యూఢిల్లీ: సుమారు రూ. 9000 కోట్ల బకాయిలతో వివాదంలో ఇరుక్కున్న లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా పేరు పనామా పేపర్లలో ప్రముఖంగా నిలిచింది. స్వదేశంలో పన్నులు ఎగవేస్తూ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న 500 మంది భారతీయుల్లో విజయ్ మాల్యా పేరు కూడా చేరింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) దశలవారీగా విడుదల చేస్తున్న పనామా పేపర్స్ తాజా వివరాల్లో మాల్యా బండారాన్ని బహిర్గతం చేసింది. మిగిలినవాళ్లలో చాలామంది పరోక్ష సంబంధాలే కలిగి ఉండగా.. మాల్యా మాత్రం ప్రత్యక్షంగా ఆయా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 15, 2006 నుంచి పనిచేస్తున్న బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ సంస్థ వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్ సంస్థతో, విజయ్ మాల్యాకు ప్రత్యక్షంగా సంబంధాలున్నాయని ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది.
దాదాపు రూ. 4వేల కోట్ల తన సొంత డబ్బును ఆయన ఈ సంస్థలో డైరెక్టుగానే పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆయన ఇంటి చిరునామా నంబర్ 3, విఠల్ మాల్యా రోడ్, బెంగళూరు పేరుతో రిజిస్టరై ఉన్న సంస్థ కార్యాలయం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఆయన పోర్టికులస్ ట్రస్ట్ నెట్ అనే మరో కంపెనీలో డైరెక్టుగా పెట్టుబడులు పెట్టారు. ఐసీఏజె అందించిన సమాచారం ప్రకారం ఈ పోర్టికులస్ ట్రస్టులో విదేశీ దొంగఖాతాల కోసం 'వన్ స్టాప్ సొల్యూషన్' సెటింగ్ ఉందని తెలిపింది. దీంతోపాటు మాల్యా పేరు బయటకు రానీయకుండా ఫోన్సెకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని కూడా తెలుస్తోంది. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖమైన కుక్ దీవుల్లో పోర్టికులస్ ట్రస్ట్ మూలాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయన ఇతర కంపెనీలు దేనికీ వెంచర్ న్యూ హోల్డింగ్స్ తో సంబంధం లేకపోవడం మరో ట్విస్ట్.