
పన్ను అరాచకత్వం అంతం
జీఎస్టీ ఆమోదం ప్రజాస్వామ్య విజయం
♦ అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట
♦ జీఎస్టీ బిల్లుపై చర్చలో మోదీ
♦ బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం
♦ సభలోని 443 మంది అనుకూలంగా ఓటు
♦ అన్నాడీఎంకే వాకౌట్
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా వేచిచూస్తోన్న జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్టకేలకు సోమవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్‌సభలో 6 గంటల చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతవారం రాజ్యసభలో చేసిన మార్పులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది.
ఓటింగ్ సమయంలో సభలో ఉన్న 443 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా అన్నాడీఎంకే సభ్యులు మాత్రం వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. చర్చలో ప్రధాని మాట్లాడుతూ... ‘పన్ను అరాచకం నుంచి విముక్తి దిశగా ఆగస్టు 8 వ తేదీ చరిత్రలో నిలుస్తుంది. స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి 1942లో ఇదే రోజున మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. అధిక పన్ను వసూలుతో పాటు అవినీతి, నల్లధనాన్ని అంతం చేయడంలో జీఎస్టీ కీలకమైన ముందడుగు. పరోక్ష పన్ను విధానంలోని నూతన శకంలో ఇక వినియోగదారుడే రాజు’ అని మోదీ అభివర్ణించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఏ ఒక్క పార్టీ, ప్రభుత్వం విజయం కాదని, ప్రతి ఒక్కరి గెలుపని, ప్రజాస్వామ్య స్ఫూర్తి విజయమని కొనియాడారు.
వెనకబడ్డ రాష్ట్రాలకు లబ్ధి
‘జీఎస్టీతో 7 నుంచి 13 పన్నులు రద్దవుతాయి. వర్తకులు సరైన బిల్లులు ఇవ్వాల్సి ఉండడంతో అవినీతి అంతానికి ఉపయోగపడుతుంది. చిన్న వర్తకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరడం వల్ల ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. ఏవైతే వెన కబడ్డ రాష్ట్రాలు ఉన్నాయో వాటికి జీఎస్టీ బిల్లుతో ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధిలో అసమతుల్యతకు పరిష్కారం చూపిస్తుంది. ఉత్పత్తి రాష్ట్రాలు బిల్లుతో నష్టపోయినా, కేంద్రం పరిహారం చెల్లిస్తుంది. రాజకీయాల కంటే జాతీయ విధానమే విజయం సాధించింది. అన్ని రాజకీయ పార్టీలకు, వివిధ పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.
లోక్‌సభ, రాజ్యసభ, 29 రాష్ట్రాలు, వాటి ప్రతినిధులు, 90 రాజకీయ పార్టీలతో సంప్రదింపుల అనంతరం మనం ఈ స్థితికి చేరుకున్నాం. తుది నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తున్నాం. కొత్త పన్ను విధానానికి మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకుంటున్నాం’ అంటూ ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీకి కొత్త నిర్వచనమిస్తూ... ‘గ్రేట్ స్టెప్ బై టీమిండియా, గ్రేట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్రేట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్పరెన్సీ’గా అభివర్ణించారు.
బిల్లు ఆమోదంలో అందరి సమష్టి కృషి
జీఎస్టీ బిల్లు తమ ఆలోచనే అన్న కాంగ్రెస్ వాదనపై మాట్లాడుతూ... అన్ని రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వాల పాత్ర ఈ బిల్లు ఆమోదంలో ఉందన్నారు. ‘ఎవరో జన్మనిస్తారు. మరెవరో ఆలనాపాలనా చూస్తారు... కృష్ణుడికి ఎవరు జన్మనిచ్చారు. ఎవరు పెంచారు?’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బిల్లును ఎందుకు వ్యతిరేకించారన్న కాంగ్రెస్ ప్రశ్నకు స్పందిస్తూ... ‘ఆ సమయంలో జీఎస్టీపై అనేక ఆందోళనలు ఉండేవి. అందుకే అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని పలుమార్లు కలిశాను. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం జీఎస్టీపై ఆందోళనల్ని పరిష్కరించడంలో సాయపడింది, లోపాల్ని తొలగించడానికి కూడా ఉపయోగపడింది’ అంటూ సమాధానమిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం కీలకం
నష్టాల్ని కేంద్రం చెల్లిస్తుందన్న అంశంలో రాష్ట్రాలకున్న ఆందోళనల నేపథ్యంలో నమ్మకం పెంపొందించాల్సిన అవసరముందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అంకెలపైనే ఆధారపడి ఉండదు. ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపైనా ముందుకు సాగుతుంది. అంకెల కారణంగా రాజ్యసభలో బిల్లుపై ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది ఏకాభిప్రాయంతో కూడిన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి’ అని సూచించారు.
పేద ప్రజలపై జీఎస్టీ ప్రభావంపై మాట్లాడుతూ... ‘పేద ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు, మందులతో సహా కొత్త పన్ను పరిధి వెలుపలే ఉంటాయి’ అని చెప్పారు. ‘చిన్న వర్తకులు లబ్ధి పొందుతారు, చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు జీఎస్టీ భద్రత కల్పిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపిస్తుంది. బిల్లు ఆమోదం అనంతరం మోదీ... విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని దేవగౌడ వద్దకు వెళ్లి కరచాలనం చేసి వారితో మాట్లాడారు.
ద్రవ్యోల్బణంపై అప్రమత్తంగా ఉండాలి: కాంగ్రెస్
బిల్లుపై చర్చలో కాంగ్రెస్ తరఫున వీరప్పమొయిలీ ప్రసంగిస్తూ... జీఎస్టీ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం ఉండి ఉంటే ఇంకా ముందుగానే ఆమోదం పొందేదన్నారు. బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, అయితే ద్రవ్యోల్బణంపై జీఎస్టీ ప్రభావం గురించి లోతుగా అధ్యయనం చేయాలని మొయిలీ హెచ్చరించారు. జీఎస్టీతో ఉత్పత్తి రాష్ట్రమైన తమిళనాడు నష్టపోతుందని ఆ పార్టీ ఎంపీ పి.వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాల ఆదాయాల్ని పరిరక్షిస్తూ పన్ను రేట్లు తక్కువ ఉండేలా చూడాలన్నారు.
బిల్లుపై చర్చలో తథాగత సత్తపతి(బీజేడీ), ఆనందరావ్ అద్సల్(శివసేన), పి.కరుణాకరణ్(సీపీఎం), తారిఖ్ అన్వర్(ఎన్సీపీ), ధర్మేంద్ర యాదవ్(ఎస్పీ), ప్రేమ్ సింగ్ చండూమజ్రా(శిరోమణి అకాళీదళ్), ప్రకాశ్ నారాయణ్ యాదవ్(ఆర్జేడీ), సిరాజుద్దీన్ అజ్మల్(ఏఐయూడీఎఫ్)లు మాట్లాడారు. జీఎస్టీ బిల్లు ఆమోదం దేశానికి శుభ పరిణామమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ వెలుపల పేర్కొన్నారు.
జీఎస్టీలో విలీనమయ్యే పన్నులు
న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక పన్నులు రద్దు కానున్నాయి. చాలా పన్నులు జీఎస్టీలో కలిసిపోనున్నాయి.
రాష్ట్రాల ఆందోళనల్ని పరిష్కరిస్తాం: జైట్లీ
వస్తు, సేవా పన్ను అమలుతో పన్ను ఎగవేత తగ్గుతుందని, దేశమంతా ఒకే పన్ను అమలుతో వ్యాపార నిర్వహణ సులభవుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మార్పులు చేసిన జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ..‘వస్తు రవాణా, సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీఎస్టీ దోహదపడుతుంది. రాష్ట్రాల ఆందోళనల్ని కేంద్ర పరిష్కరిస్తుంది’ అని తెలిపారు. ‘పన్ను రేటును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు పన్ను అధికార పరిధి విషయంలో ఉమ్మడిగా సాగుతాయి.
ఉమ్మడి పరిధికి లోబడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. కేంద్ర , రాష్ట్రాలకు సరాసరి పన్ను ఆదాయం పెరుగుతుంది. జీఎస్టీ బిల్లును రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాక, మరో మూడు చట్టాలు సీజీఎస్టీ(కేంద్ర), ఐజీఎస్టీ(అంతరాష్ట్ర), ఎస్జీఎస్టీ(రాష్ట్ర)ల్ని జీఎస్టీ కౌన్సిల్ రూపొందిస్తుంది. సీజీఎస్టీ, ఐజీఎస్టీల్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉండగా, రాష్ట్రాలు ఎస్జీఎస్టీని ఆమోదిస్తాయి. అదే సమయంలో జీఎస్టీ అమలు కోసం విధివిధానాల్ని రూపొందించే పనిని జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తుంది’ అని జైట్లీ చెప్పారు. జీఎస్టీ బిల్లు 2011లో రాష్ట్రాలకు పరిహారాన్ని పేర్కొనలేదని, పరిహారాన్ని మూడేళ్ల పాటు మొత్తం ఇచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రాథమికంగా ప్రతిపాదించడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించిందని జైట్లీ గుర్తుచేశారు.
‘ఏకాభిప్రాయంతో కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుదని 2011 బిల్లులో పేర్కొన్నా... ఏకాభిప్రాయం అంటే ఏమిటో అందులో చెప్పలేదు. స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు నాల్గింట మూడొంతుల మెజార్టీతో కౌన్సిల్ ప్రతి నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించాం. రాష్ట్రాలు మూడింట రెండొంతుల ఓటింగ్ హక్కుల్ని, కేంద్రం మూడింట ఒక వంతు ఓటుహక్కును కలిగి ఉంటుంది’ అని అన్నారు.