ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయ్యిమంది ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు చుక్కలు కనపించాయి. ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ కండిషన్ వ్యవస్థ పనిచేయడం ఆగిపోవడంతో ప్రయాణికులంతా చెమటలో తడిసిముద్దయ్యారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఢిల్లీ మెట్రో టెర్మినల్ కు సంబంధించి ఓ సొరంగ నిర్మాణం పనులు చేపడుతుండగా విమానాశ్రయంలోని ఎయిర్ కండిషన్ వ్యవస్థ చెడిపోయింది.
ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు చెప్పారు. సొరంగ పనులు చేపడుతుండగా ఎయిర్ కూలింగ్ సిస్టం కోసం ఏర్పాటుచేసిన నీటి సరఫరా పైపు పగిలిపోయిందని తెలిపారు. దీనివల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కూలింగ్ వ్యవస్థ ఆగిపోయిందని చెప్పారు. దాదాపు 1000మంది చెమటతో ఉక్కిరిబిక్కిరయ్యారని అధికారులు చెప్పారు. ఉక్కపోత కారణంగా ఏర్పడిన దప్పిక సమస్యను తీర్చేందుకు వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు.